హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): అందివచ్చిన సాంకేతికతను పోలీసింగ్‌కు జోడిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. శనివారం పోలీసు అకాడమీలో ప్రొబేషనరీ డీఎస్పీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలో తెలంగాణ పోలీస్ నంబర్‌వన్‌గా ఎదగడానికి ప్రధానంగా సైబర్ నేరాలు, డ్రగ్స్‌ను అరికట్టడమేనని పేర్కొన్నారు. నాడు పోలీసులు ఫోర్స్‌గా పనిచేస్తే.. నేడు సర్వీసుగా పనిచేస్తున్నారని చెప్పారు. డ్రోన్ సర్వేలియన్స్ ద్వారా ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తూ తెలంగాణ పోలీస్ గొప్ప పేరు పొందిందని వివరించారు. సీసీటీఎన్ఎస్ అండ్ ఐసీజేఎస్ ద్వారా పోలీస్, కోర్టులు, జైళ్ల విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, డిప్యూటీ డైరెకర్లు కవిత, మధుకరస్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ నరహరి, డీఎస్పీలు రామారావు, దేవారెడ్డి, అకాడమీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.