Hydel Power Plant| హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జలవిద్యుత్తు విద్యుత్తు ప్లాంట్లను సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్నది. మొత్తం ప్లాట్లలో మరమ్మతులు వర్షాకాలం నాటికి పూర్తవుతాయో లేదో కూడా అధికారికవర్గాలు స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. 150 మెగావాట్ల శ్రీశైలం నాలుగో యూనిట్ మరమ్మతులు నడుస్తున్నాయి. ఈ పనులు ఇప్పట్లో పూర్తికావడం కష్టమేనని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఇక 40 మెగావాట్ల అప్పర్ జూరాల యూనిట్-3లోనూ మరమ్మతు పనులు నడుస్తున్నాయి. జూన్ రెండోవారంలో వర్షాలు మొదలై, ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. అప్పటిలోపు ఈ రెండు యూనిట్లలో మరమ్మతులు పూర్తి చేసి, విద్యుత్తు ఉత్పత్తికి సిద్ధం చేయాల్సి ఉందని, కానీ పనులు ఏ మేరకు పూర్తవుతాయో స్పష్టంగా చెప్పలేమని అధికారిక వర్గాల్లోనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
పడిపోయిన జలవిద్యుత్తు ఉత్పత్తి!
శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు లేవు. నాగార్జునసాగర్ కూడా ఖాళీ అయింది. మిగతా రిజర్వాయర్లదీ అదే దుస్థితి. దీంతో జలవిద్యుత్తు ఉత్పత్తి పడిపోయింది. ఫలితంగా థర్మల్, సోలార్ విద్యుత్తుపైనే ఆధారపడాల్సి వస్తున్నది. రాష్ట్రంలో చిన్నాపెద్దా ప్రాజెక్టులు కలిపి మొత్తం 11 జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. వీటి స్థాపిత విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 2,441 మెగావాట్లు. కానీ ఏప్రిల్ నెలలో అన్ని ప్లాంట్లలో కలిపి కేవలం 56.50 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అయింది. ప్రధానమైన శ్రీశైలం ప్లాంట్లో 900 మెగావాట్లకు నెల మొత్తంలో 1.76 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయింది.
815 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాగార్జునసాగర్ ప్లాంట్లో ఏప్రిల్లో ఉత్పత్తి అయిన విద్యుత్తు 41.81 మిలియన్ యూనిట్లు మాత్రమే. జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరు ప్లాంట్లలో ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి కాలేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విద్యుత్తురంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మిగిలిన ఐదు యూనిట్లల్లో కేవలం 56 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయిందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. థర్మల్, సోలార్ విద్యుత్తు ఉత్పత్తితో పోల్చితే జలవిద్యుత్తు ఉత్పత్తికి ఖర్చు తక్కువ. పూర్తిగా థర్మల్, సోలార్ ద్వారానే ఉత్పత్తి చేయడం ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా భారమేనని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో నీళ్లు లేనందున ఉత్పత్తి జరగడంలేదంటూ చెప్తున్న అధికారులు, నీళ్లు ఉన్నప్పుడు ఉత్పత్తిని ఎందుకు తగ్గించారో అర్థం కావడంలేదని విమర్శిస్తున్నారు.