హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో నీళ్ల కోసం ప్రజలు కన్నీళ్లు పెట్టుకునే దుస్థితి దాపురించిందని.. ఇదేనా కాంగ్రెస్ సర్కారు చెప్పుకునే ప్రజాపాలన అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లివ్వండి మహాప్రభో అని వేడుకోవల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని మంగళవారం ‘ఎక్స్’లో ఆవేదన వ్యక్తంచేశారు.
సాగునీటి కోసం రైతులు కాళ్లమీద పడుతున్నా.. రేవంత్ ప్రభుత్వం కరుణించడంలేదని మండిపడ్డారు. సాగునీరు దేవుడెరుగు.. కనీసం తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాపాలన అంటే నీళ్లివ్వకపోవడం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడమేనా? అని ప్రశ్నించారు. వెంటనే సర్కారు స్పందించి ఆదివాసీలకు తాగునీరందించాలని డిమాండ్ చేశారు.