హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య తెలంగాణ ఉద్యమకారుడు, టీఎన్జీవో కోశాధికారి, ఉద్యోగ సంఘాలనేత రామినేని శ్రీనివాసరావు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. సోమవారం పెద్దఎత్తున తరలివచ్చిన ఆత్మీయులు నాదర్గుల్ శ్మశానవాటికలో కన్నీటి వీడ్కోలు పలికారు.
శ్రీనివాసరావు భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించిన ఉద్యోగ సంఘాల నేతలు తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాసరావు సేవలను స్మరించుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యమకారులు స్వామిగౌడ్, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, రవీందర్‌రెడ్డి, వీ ప్రకాశ్, ముజీబ్, శ్రీధర్‌రావు దేశ్‌పాండే, మధుసూదన్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్ హాజరై నివాళులర్పించారు.
శ్రీనివాసరావు మరణం ఉద్యోగ సంఘానికి తీరనిలోటని తెలిపారు. శ్రీనివాసరావుకు మంత్రి శ్రీధర్‌బాబు నివాళులర్పించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శ్రీనివాసరావు నిరంతరం తపించేవారని గుర్తుచేసుకున్నారు.