Gurukula Transfers | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): దేవుడు వరమిచ్చినా పూజరి కరుణించలేదనట్టుగా తమ పరిస్థితి తయారైందని గురుకుల సొసైటీ ఉద్యోగులు, ఉపాధ్యాయు లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బదిలీలకు అనుమతులిస్తూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినా, సొసైటీ ఉన్నతాధికారులు వాటిని తుంగలో తొక్కుతున్నారని మండిపడుతున్నారు. ఒక్కో సొసైటీ ఒక్కో మార్గదర్శకాలను అనుసరిస్తూ తమ అవకాశాలను దెబ్బకొడుతున్నాయని వాపోతున్నాయి. మైనార్టీ గురుకులం నాలుగేండ్ల సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బదిలీ అవకాశాన్ని కల్పిస్తున్నా, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శకాలను రూ పొందించాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఇచ్చిన సడలింపును గురుకుల సొసైటీలకు వర్తింపజేస్తూ ఎనిమిదేండ్లుగా ఒకే స్థానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకే బదిలీ అవకాశాన్ని కల్పించాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సొషల్, ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీల తీరుతో 2018, 2019లో రిక్రూట్మెంట్ అయి ఆరేండ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారందరూ నష్టపోవా ల్సి వస్తున్నదని ఆయా సొసైటీల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయులు వాపోతున్నారు.
ఫైనాన్స్ జీవోను అమలు చేస్తే ఆయా డిపార్ట్మెంట్ల పర్మిషన్ అవసరం లేదని ఉద్యోగ, ఉపాధ్యా య సంఘాలు వివరిస్తున్నాయి. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఫైనాన్స్ జీవో 80కి విరుద్ధంగా మార్గదర్శకాలను రూపొందించడమేగాక, ఆయా డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్ కూడా తీసుకోలేదని ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు.