కొన్ని పదార్థాలు అందాన్ని కాపాడితే.. మరికొన్ని ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. కానీ, రెండిటినీ మెరుగుపరిచేవి చాలా తక్కువగా కనిపిస్తాయి. పసుపు-అల్లం.. ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే, అందంతోపాటు ఆరోగ్యానికీ హామీ ఇస్తాయి. ఇంట్లోనే తయారుచేసుకొనే పసుపు-అల్లం షాట్‌తో.. మరెన్నో అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి. ఒక గ్లాస్లో సగం వరకూ నీళ్లు తీసుకొని.. టీస్పూన్ పసుపు, అంగుళం తాజా అల్లం దంచి వేయాలి. ఇందులోనే అరచెక్క నిమ్మకాయను పిండుకోవాలి. చిటికెడు నల్ల మిరియాలూ జోడించాలి.
రుచి కోసం ఓ టీస్పూన్ తేనె కలుపుకోవచ్చు. అన్నిటినీ బాగా కలిపి.. వడపోసుకొని వెంటనే తాగేయడమే! అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ పసుపు-అల్లం షాట్‌ను ప్రతిరోజూ తీసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే.. మంచి ఫలితాలను చూడొచ్చు. పసుపులోని కర్కుమిన్, అల్లంలోని జింజెరాల్.. శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, కండరాల వాపుతో బాధపడేవారికి.. ఈ రెండిటి కాంబినేషన్ ఒక సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తిని తగ్గించడంలో అల్లం ముందుంటే.. కాలేయం పనితీరును పసుపు మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. ఈ మిశ్రమం రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. పసుపులోని కర్కుమిన్ చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది. అల్లంలోని సుగుణాలు.. మొటిమలు, నల్ల మచ్చలను నివారించడంలో సమర్థంగా పనిచేస్తాయి. చర్మానికి సరికొత్త నిగారింపును తీసుకొస్తాయి. అయితే, పిత్తాశయ వ్యాధిగ్రస్తులు, రక్తం పలుచబడే మందులు తీసుకునేవారు ఈ షాట్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పాలు ఇచ్చేవారు వైద్యుడిని సంప్రదించాకే తీసుకోవాలి.