హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): నిధుల కొరత అంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తు న్న సర్కారు ఆఖరికి టీచర్లకు కూడా బకాయిలు చెల్లించడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుడు పదోతరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు పారితోషికం చెల్లించలేదని మండిపడుతున్నారు. ఏడాది గడిచినా ప్రభుత్వం రూ.20 కోట్లు ఇవ్వడానికి వెనుకాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మళ్లీ పదోతరగతి పరీక్షలు వస్తున్నాయని, ఈ ఏడాదైనా ఇస్తారో, ఎగనామం పెడుతారో అర్థం కావడంలేదని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బకాయిల కోసం 20 వేల మంది ఉపాధ్యాయులు నిరీక్షిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం ఇప్పటికే వివిధ బకాయిల కింద మొత్తం రూ.80 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు. వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.