హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటుపై విద్యాశాఖ జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని మెజార్టీ ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇది అనాలోచిత, అసంబద్ధ నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవరించి, ప్రాథమిక పాఠశాలలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటును జూన్ 13లోపే పూర్తిచేయాలంటూ విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. వాస్తవానికి జూన్ 12న బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 6 నుంచి 19 వరకు బడిబాట నిర్వహించనున్నారు. బడులు ప్రారంభమైన మరుసటి రోజులోపే టీచర్లను సర్దుబాటు చేయాలని అనడాన్ని మెజార్టీ ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
లక్ష చేసినా వృథానే
పాఠశాల విద్యాశాఖ పుండు ఒక చోట ఉంటే మందు మరోచోట రాస్తున్నదని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రాథమిక పాఠశాలలకు తరగతికి ఒక టీచర్‌ను ఇవ్వకుండా లక్ష సంస్కరణలు చేసినా వృథానే అని అంటున్నారు. రాష్ట్రంలో చాలా ప్రైమరీ స్కూళ్లు ఒకరిద్దరు టీచర్లతోనే నడుస్తున్నాయి. ఐదు తరగతులున్న స్కూళ్లల్లో ఒకరిద్దరు టీచర్లతో విద్యార్థులకు న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.
ఆందోళనలో ఎస్జీటీలు
మిగులు టీచర్ల సర్దుబాటు పేరిట విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై సెకండరీ గ్రేడ్ టీచర్లంతా ఆందోళనలో ఉన్నారు. ఈ ఉత్తర్వుల బాధితులంతా ఎస్జీటీలే. సర్కారు బడుల్లో జూన్ 30 వరకు ఎన్రోల్మెంట్ కొనసాగుతుంది. అడ్మిషన్లు పెరుగుతుంటాయి. అడ్మిషన్లు పెరిగిన తర్వాత టీచర్లు లేకపోతే ప్రభుత్వ బడులపై నమ్మకంపోతుంది. పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో మేం ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.
-అనిల్‌కుమార్, ఎస్టీటీ ఫోరం నాయకుడు
ఇది అనాలోచిత చర్య
మిగులు టీచర్లను జూన్ 13లోపే సర్దుబాటు చేయాలనడం అనాలోచిత చర్య. ఇది తప్పుడు, అసంబద్ధ నిర్ణయం. తరగతికి ఒక టీచర్ ఉండాలని సాక్షాత్తు విద్యాకమిషన్ చెప్పింది. అధికారులేమో విద్యాకమిషన్ సిఫారసులకు విరుద్ధంగా, విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను కేటాయిస్తామంటున్నారు. 60 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లుంటే పాఠాలెలా చెప్పడం అర్థమైతలేదు.
– మల్లికార్జున్‌రెడ్డి, ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్
సర్దుబాటు చేయాలి
మిగులు టీచర్లున్నట్టు జూన్‌లోనే ఎలా తేల్చుతారు. చాలా ప్రాంతాల్లో సర్కారు బడుల్లో విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తున్నారు. మేం ఇంటింటికి తిరిగి పిల్లల నమోదును పెంచేందుకు ప్రయత్నిస్తుంటే.. అధికారులేమో బడుల్లో టీచర్లు లేకుండా చేస్తున్నారు. పిల్లలు చేరిన తర్వాత బడుల్లో టీచర్లు లేకపోతే ఎలా..? ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చేయాల్సిన సర్దుబాటును జూన్‌లోనే చేయాలనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బడిబాట ముగిసిన తర్వాత ఆగస్టులో సర్దుబాటు చేయాలన్నదే మా ప్రధాన డిమాండ్.
– మహిపాల్‌రెడ్డి, సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్