హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారం, హామీల అమలు డిమాండ్‌తో అంగన్వాడీలు ఆందోళనబాట పట్టారు. ఈ మేరకు గురువారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడచినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రి, అధికారులను కలిసి డిమాండ్ చేశారు. రూ.13650గా ఉన్న అంగన్వాడీ టీచర్ల జీతం రూ.18000కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష చెల్లిస్తామన్న రేవంత్ సర్కారు హామీని ఆచరణలోకి తీసుకురావాలని కోరారు. ఖాళీగా ఉన్న 15,000 టీచర్లు, ఆయాలతో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ధర్నాకు సిద్ధమయ్యామని అంగన్వాడీల సంఘం నాయకులు జయలక్ష్మి తెలిపారు. నేడు ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ధర్నాకు సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది.