జడ్చర్లటౌన్, ఏప్రిల్ 8 : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి డిమాండ్చేశారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో ఆయన మాట్లాడారు. మూడేండ్లు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్కు పీఆర్సీ ఇవ్వడంలేదని మండిపడ్డారు. మార్చి 24 తర్వాత ఉద్యోగ విరమణ పొందిన 25వేల మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని వాపోయారు.
ప్రభుత్వం వెంటనే రూ. 500 కోట్లు విడుదల చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈహెచ్ఎస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించిన జీవో నేటికీ విడుదల చేయలేదని ఆరోపించారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 17న మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.