Teacher Suspend | ఆసిఫాబాద్ : విద్యార్థులతో పాటు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు తప్పటడుగులు వేశాడు. పీకల దాకా మద్యం సేవించి పాఠశాలకు హాజరయ్యాడు. విచారణ చేపట్టిన అధికారులు.. ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు మండల పరిధిలోని సుకుతుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో జే విలాస్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి ఉపాధ్యాయుడు మద్యం సేవించి పాఠశాలకు హాజరవుతున్నాడు. అంతేకాకుండా పాఠాలు బోధించకుండా, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు ఉపాధ్యాయుడు విలాస్పై ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.