బల్మూరు, జనవరి 25 : నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థినిపైకి చెప్పు విసిరాడు. స్థానికుల కథనం మేరకు.. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు రిహార్సల్స్ నిర్వహించింది. 9వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి శిక్షణ ఇస్తుండగా.. బయట ఆటల పోటీలు ముగించుకొని సాయిలీల అనే విద్యార్థి నవ్వుతూ తరగతిలోకి వెళ్లింది.
తనను చూసే నవ్విందని తప్పుగా అనుకున్న ఉపాధ్యాయుడు చెప్పు విసిరాడు. అది కాస్తా సాయిలీల పక్కనే ఉన్న మరో విద్యార్థిని అంజలి తగలటంతో స్వల్ప గాయమైంది. విషయం తెలుసుకున్న ఇద్దరి విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న డీఈవో రమేశ్‌కుమార్.. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 25: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులతో పనులు చేయించిన ముగ్గురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. సంగారెడ్డి పట్టణంలోని ఏపీహెచ్‌బీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులతో కంకర, రాళ్లు మోయించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. స్పందించిన కలెక్టర్ వల్లూరి క్రాంతి చర్యలకు ఆదేశించారు. విచారణ అనంతరం ఉపాధ్యాయులు మంజుల, శారద, నాగమణిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఎస్ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఘటనపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫైర్ అయ్యారు. విద్యార్థులతో కంకర మోయించడంపై బాధాకరమని పేర్కొన్నారు.