హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమయంలో ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంలో ఆరితేరిన కాంగ్రెస్ సర్కార్, మరో వంచనకు సిద్ధమైంది. టీచర్ల సర్దుబాటు పేరిట స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం చేసింది. విద్యారంగ ప్రక్షాళన మాట పక్కన పెట్టి ప్రభుత్వ విద్యకు సమాధి కట్టే ప్రణాళికలను అమలు చేస్తున్నది. 27వేల సర్కార్ స్కూళ్లను 4వేలకు కుదిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించగా, ఈ మాటలను ఆచరణలో పెట్టే దిశగా విద్యాశాఖ అడుగులేస్తున్నది. మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియను చేపట్టింది. దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు కటాఫ్ తేదీని జూలై 31కి పొడిగించాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాలల్లో మిగులు టీచర్ల సర్దుబాటుకు ఇటీవలే పాఠశాల విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. జిల్లా యూనిట్ విద్యార్థుల సంఖ్యను బట్టి మిగులు టీచర్లను తేల్చి వారిని సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 20వ తేదీ నాటికి విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను బట్టి మిగులు టీచర్లు తేలితే ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని ఉత్తర్వులిచ్చింది. గతంలో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద డిప్యుటేషన్‌పై వచ్చిన టీచర్లను ఏప్రిల్‌లో రిలీవ్ చేయలేదు. అంటే గతంలో సర్దుబాటు కింద పంపిన టీచర్లు అదే బడుల్లో కొనసాగుతున్నారు. తాజాగా మళ్లీ సర్దుబాటు ఉత్తర్వులిచ్చింది. మొత్తంగా విద్యాశాఖ జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. ప్రాథమిక బడులను మూసివేయబోతున్నారని టీచర్లు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2వేలకు పైగా జీరో ఎన్రోల్మెంట్ బడులు ఉండగా, 1400 పైచిలుకు బడులను విద్యాశాఖ మూసివేసింది. ఆ తర్వాత మిగిలిన బడుల మూసివేత ప్రక్రియకు రంగం సిద్ధం చేసిందని మండిపడుతున్నారు.
ఈ సర్దుబాటులో రాష్ట్రంలోని సగం బడులు ఖతం అవుతాయని టీచర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దాదాపు 10వేలకు పైగా ప్రాథమిక బడులు జీరోఎన్రోల్మెంట్ బడులయ్యి.. ఆ తర్వాత మూతబడుతాయని వాపోతున్నారు. ప్రాథమిక పాఠశాలలకు తరగతికి ఒక టీచర్‌కు ఇవ్వకుండా లక్ష సంస్కరణలు చేసినా వృథానేనని పేర్కొంటున్నారు.
బడిబాట కార్యక్రమంతో విద్యార్థులు సర్కార్ బడుల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. మేం ఇంటింటికీ తిరిగి పిల్లల నమోదును పెంచేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులేమో బడుల్లో టీచర్లు లేకుండా చేస్తున్నారు. పిల్లలు చేరిన తర్వాత బడుల్లో టీచర్లు లేకపోతే ఎలా..? జూన్‌లోనే టీచర్ల సర్దుబాటు చేయడం సరికాదు. మేం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
సర్కార్ బడుల్లో సెప్టెంబర్ దాకా ఎన్రోల్మెంట్ నమోదవుతున్నది. అడ్మిషన్లు పెరుగుతుంటాయి. అడ్మిషన్లు పెరిగిన తర్వాత టీచర్లు లేకపోతే ప్రభుత్వ బడులపై నమ్మకం పోతుంది. విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో మేం ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. స్వయంగా సీఎం విద్యాశాఖను తన వద్ద పెట్టుకొని ఇలా ప్రక్షాళన పేరిట మార్పులు చేయడం దారుణం.
టీచర్ల సర్దుబాటు ప్రక్రియను ఇప్పుడు చేపట్టడం అనాలోచిత చర్య. ఈ విషయంపై సర్కార్ పునరాలోచించాలి. ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే సవరించాలి. జూలై 31 తర్వాతే సర్దుబాటును చేపట్టాలి. ఇప్పటికే అనేక బడులు టీచర్ల కొరతతో ఇబ్బందిపడుతున్నాయి. టీచర్ల ను సర్దుబాటు చేస్తే పాఠశాలలు మరింత బలహీనపడుతాయి. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు టీచర్లు కష్టపడుతుంటే టీచర్ల సంఖ్యను తగ్గించే చర్యలు గర్హనీయం.