ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 01:58:17

నెలాఖరులోగా టీచర్ల పదోన్నతులు

నెలాఖరులోగా టీచర్ల పదోన్నతులు

  • బదిలీలు, టెట్‌, విద్యాసంస్థలు తెరువడంపై సీఎంతో చర్చించిన తర్వాతే నిర్ణయం
  • సమీక్షలో మంత్రి సబితా

హైదరాబాద్‌, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల పదోన్నతులను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రక్రియనంతా త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. మంగళవారం బీఆర్‌కేభవన్‌ (సచివాలయం)లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులతో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. క్యాటగిరీలవారీగా బోధన, బోధనేతర సిబ్బంది పదోన్నతులు పూర్తిచేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బదిలీలు, మధ్యాహ్న భోజనం, టెట్‌, విద్యాసంస్థల ప్రారంభం తదితర అంశాలపై అధికారులతో చర్చించిన మంత్రి.. సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమీక్షలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌, ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌, సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన పాల్గొన్నారు. 

పదోన్నతులకు కార్యాచరణపై హర్షం

ఉపాధ్యాయ పదోన్నతులను నెలాఖరులోగా పూర్తిచేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ నేతలు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. 

ఐడీసీ సర్వీసు నిబంధనలపై చర్చ

రాష్ట్ర నీటిపారుదలరంగం పునర్వ్యవస్థీకరణలో భాగంగా నీటిపారుదల అభివృద్ధి సంస్థను (టీఎస్‌ఐడీసీ) జలవనరుల శాఖలో ప్రభుత్వం విలీనం చేసింది. వారికి సర్వీస్‌ నిబంధనలు ప్రత్యేకంగా ఉండాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ నేతృత్వంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు.


logo