రంగారెడ్డి, జనవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతున్నదని, నోటిఫికేషన్ విడుదలకు చర్యలు చేపడుతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ఐదో రాష్ట్ర మహాసభలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని బీఎంఆర్ కన్వెన్షన్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య అధ్యక్షతన జరిగిన సభలకు మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. సమాజంలో ఉపాధ్యాయుల వల్లే మార్పు సాధ్యమని, విద్యార్థుల ఉన్నతికి వీరే మార్గదర్శకులని చెప్పారు. కరోనా వల్ల విద్యావ్యవస్థ అనేక సవాళ్లు ఎదుర్కొన్నదని.. టీవీలు, డిజిటల్ విధానంలో బోధనకు ఉపాధ్యాయులు అందించిన సహకారం గొప్పదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ క్రమశిక్షణ ఉన్న సంఘమని ప్రశంసించారు.
రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో విద్యా శాఖవే ఎక్కువ ఉన్నాయని, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభమైందని, దీనిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్టు వెల్లడించారు. కేరళ మాజీ మంత్రి, ప్రభుత్వ విప్ కేకే శైలజా టీచర్ మాట్లాడుతూ విద్యా రంగంలో మనువాద భావజాలాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, ఇది దేశానికే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని, యువత ఉద్యోగాలు లేక, భావ ప్రకటనా స్వేచ్ఛ లేక పెడదోవ పడుతున్నారని తెలిపారు. ఫ్యూడల్ భావజాలాన్ని పెంచేందుకే కేంద్రం నూతన విద్యా విధానాన్ని రూపొందించిందని విమర్శించారు. భారత రాజ్యాంగం ప్రమాదకర స్థితిలో ఉన్నదని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీపై పోరాడేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని ఆమె గుర్తు చేశారు.
మతం పేరుతో రెచ్చగొడుతున్న బీజేపీ : మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్
కేంద్రంలోని బీజేపీ సర్కారు మతం పేరుతో వైషమ్యాలను రెచ్చగొడుతున్నదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ దుయ్యబట్టారు. సమాజంలో భావజాల యుద్ధం నడుస్తున్నదని, ప్రగతిశీల ఉపాధ్యాయులు మౌనంగా ఉండొద్దని సూచించారు. ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయని.. సామాన్యులకు రోజు కూలీ రూ.300 వస్తే, అదానీ ఆదాయం మాత్రం రోజుకు రూ.1600 కోట్లు వస్తున్నదని వివరించారు. సీబీఐ, ఈడీ తరహాలో న్యాయమూర్తులను నియమిస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అంటున్నారని చెప్పారు. తెలంగాణ గవర్నర్‌కు రాజ్యాంగం గురించి తెలియదని, మంత్రి మండలి సలహా మేరకే నిర్ణయాలు తీసుకోవాలని, గవర్నర్లకు ప్రత్యేక అధికారాల్లేవని గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టాన్ని రద్దు చేస్తావా? ఢిల్లీ పీఠాన్ని వదులుకుంటావా? అని మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనిత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకటరమణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి, ఉపాధ్యక్షులు రాములు, దుర్గాభవాని, కోశాధికారి లక్ష్మారెడ్డి, గాలయ్య, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య పాల్గొన్నారు. అంతకుముందు ఉపాధ్యాయులు ఎర్రజెండాలు చేతబూని మహా ప్రదర్శన నిర్వహించారు.