కల్వకుర్తి రూరల్, నవంబర్ 13 : విద్యార్థులు నవ్వారని ఉపాధ్యాయుడు వారిని చితకబాదిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. కల్వకుర్తిలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో బుధవారం ఉదయం 10 గంటలకు 9వ తరగతి విద్యార్థులకు తెలుగు పరీక్ష నిర్వహించేందుకు గెస్ట్ టీచర్ వెంకటేశ్వర్లు వెళ్లాడు.
ప్రశ్నలను బోర్డుపై రాయగా 40 మంది విద్యార్థులు పేపర్‌పై రాసుకొని బయటకు నెమ్మదిగా నవ్వుకుంటూ వెళ్లారు. గమనించిన ఉపాధ్యాయుడు అసహనానికి గురై 36 మందిని చితకబాదాడు. అఖిల్, నేహాంత్కు గాయాలవడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి నచ్చజెప్పి విద్యార్థులను పంపిచారు. విషయం తెలిసిన బీఎస్ఎఫ్ నాయకుడు సాయిబాబు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ ఉషారాణిని నిలదీయడంతో సదరు ఉపాధ్యాయు డిని సస్పెండ్ చేశారు.