ఇల్లెందు, నవంబర్ 14: ఎంఈవోపై ఉపాధ్యాయుడు దాడి చేశాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లెందులో శుక్రవారం చోటుచేసుకున్నది. ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్ కథనం ప్రకారం.. ఇల్లెందు సుభాశ్నగర్లోని జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఎం ఉమాశంకర్ అదే మండలానికి ఇన్చార్జి ఎంఈవోగా కొనసాగుతున్నారు. ఇస్లావత్ శంకర్ (ఊత కర్రతో నడిచే దివ్యాంగుడు) కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఇద్దరూ విధుల్లో ఉన్నారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికలో మధ్యాహ్నం తరువాత పెట్టాల్సిన సంతకాన్ని ఉపాధ్యాయుడు ఇస్లావత్ శంకర్ ఉదయం 11 గంటలకే పెట్టాడు. గమనించిన ఎంఈవో సదరు ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. హాజరు పట్టికలో ఇలా ఇష్టానుసారంగా సంతకాలు చేయడం సరికాదని మందలించాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు శంకర్.. ‘నీవు ఎవరు నన్ను అడగడానికి’ అంటూ ఎంఈవోను దుర్భాషలాడాడు. అదే సమయంలో తన చేతిలో ఉన్న ఊత కర్రతో ఎంఈవోపై దాడి చేశాడు. దీంతో ఎంఈవో కుడి చేతికి, మెడకు గాయాలయ్యాయి. ఎంఈవో ఉమాశంకర్ ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్టు సీఐ సురేశ్ తెలిపారు.