గూడూరు, జూన్ 29 : విద్యార్థులు, ఉపాధ్యాయులు సమభావంతో ఉండాలన్న ఉద్దేశంతో విద్యార్థులు ధరించే స్కూల్డ్రెస్తో పాఠశాలకు వచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీదిగూడెం పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు వాంకుడోత్ గోపీనాథ్ విద్యార్థులతో స్నేహంగా ఉంటూ విద్యాబుద్ధులు నేర్పేందుకు సోమవారం రోజు విద్యార్థులు ధరించే స్కూల్ యూనిఫామ్‌తో వచ్చాడు. మొదటగా విద్యార్థులు ఆశ్చర్యపోయి, తర్వాత ‘మా సారే ఇలా వచ్చారు’ అంటూ సంతోషపడ్డారు. పాఠశాలలోకి గౌరవంగా తీసుకెళ్లారు. విద్యార్థులతో మమేకమై పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడిని హెచ్ఎం సుమలతతోపాటు గ్రామస్తులు అభినందించారు.