హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రియల్ రంగంపై దెబ్బ మీద దెబ్బ పడుతున్నది..ఇప్పటికే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కొత్త ప్రాజెక్టులు మార్కెట్లోకి రాకపోగా.. చేతిలో ఉన్న ప్రాజెక్టులలో సైతం ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో బిల్డర్లు కోలుకోవడం లేదు. రోజురోజుకు ఆర్థికంగా బక్కచిక్కుతున్న బిల్డర్లు కొందరు మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవల మేడ్చల్‌లో ఓ బిల్డర్ ఆత్మహత్య చేసుకోవడం రియల్ రంగాన్ని మరింత కుంగదీసింది. ప్రముఖ ప్రాజెక్టులలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక సగం మందిని తీసేసిన దాఖలాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాల్సిన రేవంత్ సర్కార్ ఎఫ్ఎస్ఐ (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) పరిమితిని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు లీకులు ఇచ్చింది. ఇది రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ఆలోచనలో పడేసింది. అంతేకాకుండా మార్కెట్లో విచ్చలవిడిగా దొరికే టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) సర్టిఫికెట్లను బ్లాక్ మార్కెట్లోకి వెళ్లేందుకు ప్రభుత్వం కారణమైంది.
త్వరలో ఎఫ్ఎస్ఐ పరిమితిని తీసుకురాబోతున్నదనే ప్రచారం చేయడం, ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకంగా రూ.100 కోట్ల టీడీఆర్ బాండ్స్‌కు ప్రయత్నాలు చేయడంతో వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సిన టీడీఆర్ సర్టిఫికెట్ల జారీని నామమాత్రంగా విడుదల చేయటం, మరోవైపు ఎఫ్ఎస్ఐ, త్వరలో రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతుందనే ప్రచారంతో టీడీఆర్‌లను దక్కించుకునేందుకు బిల్డర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో వాటి హక్కుదార్లు టీడీఆర్‌ల ధరలను అమాంతం పెంచేశారు. ఒకప్పుడు 24 శాతంలో దొరికే టీడీఆర్‌లు ప్రస్తుతం 40 శాతానికి పెరిగాయి. ఓ యాజమాని తన దగ్గరున్న టీడీఆర్‌ను ఎన్ని భాగాలుగానైనా అమ్ముకునే వీలు ఉంటుంది. టీడీఆర్ కొనుగోలు చేసిన వారు దానితో నిర్మాణ అనుమతి రుసుం చెల్లించవచ్చు. అదనపు అంతస్తులు, సెట్‌బ్యాక్ మినహాయింపులకూ టీడీఆర్ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. దీంతో ఖరీదైన ప్రాంతాల్లో పరిమితికి మించి అదనపు అంతస్తులు నిర్మించాలనుకునే వారంతా టీడీఆర్‌ను కొనుగోలు చేస్తున్నారు.