Chandrababu | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ విస్తరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో శనివారం రాష్ట్రంలోని ముఖ్యనాయకులతో చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ అభివృద్ధిపై సమాలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తులో ఉంటాం.. ఏ కూటమిలో కొనసాగుతాం అనే విషయాలు ఇప్పుడే వెల్లడించలేనని అన్నారు.
‘ఆ రోజు నేను వేసిన పునాది వల్ల తెలంగాణ నేడు తలసరి ఆదాయంలో నంబర్ వన్‌గా నిలిచింది. నేను ఒక్కడ్నే చేశానని చెప్పడం లేదు.. నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు’ అని చంద్రబాబు చెప్పారు. రెండు రాష్ర్టాల మధ్య సమస్యల పరిష్కారానికి మళ్లీ తెలంగాణ సీఎంను కలుస్తానని చెప్పారు.