వరంగల్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తన రాష్ట్రంలోని సమస్యలన్నీ గాలికి వదిలేసి అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెట్టినట్టు? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీనే ‘నవ నిర్మాణ సభ’ పేరుతో సమావేశం నిర్వహించాలని ఎందుకు నిర్ణయించినట్టు? సందర్భం లేకపోయినా, అవసరం లేకపోయినా ‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు? వీటన్నింటి వెనుక ఎవరున్నారు? అని తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది. దీనిపై లోతుగా ఆరా తీస్తే చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని మొదటినుంచీ జీర్ణించుకోలేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని, మళ్లీ తెలంగాణలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారని, అందులో భాగమే ఇటీవలి వరుస పరిణామాలు, పవన్‌కల్యాణ్ ఎపిసోడ్ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించినప్పటినుంచి ఏటా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహించుకొంటున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు 2015 జూన్ 2న ఏపీలో ‘నవ నిర్మాణ దీక్ష’ పేరుతో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయామంటూ విషప్రచారం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలను ఏకం చేయడమనే ముసుగు తొడిగినా.. నవ నిర్మాణ ప్రతిజ్ఞలోనే ‘అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన’ అని పేర్కొన్నారని, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడమే కదా! అని విశ్లేషకులు చెప్తున్నారు. ఐదేండ్లపాటు ఏటా వారం రోజులు తెలంగాణ ఆవిర్భావం రోజే ‘నవ నిర్మాణ దీక్ష’ పేరుతో రాష్ట్ర విభజనను ఆడిపోసుకున్నారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ‘నవ నిర్మాణ సభ’ను నిర్వహించాలని భావించారని, ఈ పేరును బట్టే బాబు డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని స్పష్టమవుతున్నదని అంటున్నారు.
‘చింత చచ్చినా పులుపు చావలేదు’ అన్నట్టు తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించి 12 ఏండ్లయినా, తాను ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా.. చంద్రబాబు ఇంకా తెలంగాణ వనరులపై ఆశ వదులుకోలేకపోతున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ చంద్రబాబు తెలంగాణ రాజకీయాల వైపు చూడలేదు. రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ఆయన కన్ను తెలంగాణ మీద పడిందని చెప్తున్నారు. తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలోనే ఇటీవలి మహానాడు వేదికగా తెలంగాణ వ్యతిరేక ప్రసంగాలు, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తెరవెనుక సూత్రధారి ఆయనేనని స్పష్టంచేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడినవాళ్లు.. ప్రత్యేకించి సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు పేరు ఎత్తగానే సభా ప్రాంగణంలో పథకం ప్రకారం ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున్న నినాదాలు చేయించారనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు పవన్‌కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తంచేయడం, ఎవరు ఎకడైనా సభలు నిర్వహించుకోవచ్చు’ అని చంద్రబాబు బుధవారం పేర్కొనడాన్ని బట్టి చూస్తే, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీచేసేందుకు సన్నద్ధమవుతున్న విషయం తెలస్తున్నదని చెప్తున్నారు. ‘నేను తమిళనాడులో ప్రచారం చేసి వచ్చా, అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అని ఆంధ్రాలోనూ పెట్టారు’ అని మొదలుపెట్టి అమెరికా, యూరప్, దేశాల ఉదాహరణలతో ఊకదంపుడు వెనుక ఆంతర్యం ‘నేనూ తెలంగాణలో పోటీ చేస్తా’ అని చెప్పడమేనని అంటున్నారు.