ఖైరతాబాద్/కృష్ణకాలనీ, జూలై 18: రాష్ట్రంలోని బొగ్గుబావులను వేలం వేయొద్దని ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైరతాబాద్ మీదుగా ర్యాలీగా బయలుదేరగా, మెట్రోస్టేషన్ వద్ద కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్ మాట్లాడుతూ సింగరేణి నుంచి కేంద్ర, రాష్ర్టాలకు డివిడెంట్స్, పన్నుల రూపంలో ప్రతి సంవత్సరం రూ.8వేల కోట్లు చెల్లిస్తున్నదని తెలిపారు.
ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పదో విడత బొగ్గు బావుల వేలంను ప్రారంభించిందని, తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయించి మరీ అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. ఇందులో శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా వేలం పెట్టడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేసి రూ.29వేల కోట్లు సంపాదించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని, 40వేల మంది పర్మినెంట్, 26వేల కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రాష్ట్రంలోని ప్రతి బొగ్గు బ్లాకు సింగరేణికే దక్కాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఉపాధ్యక్షులు గడప రాజయ్య, శ్రీనివాస్, జాఫర్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, కిరణ్, సమ్మయ్య, నరేశ్, అవినాశ్ రెడ్డి, సీఐటీయూ నాయకులు బాల్‌రాజ్, సీఐటీయూ నాయకులు పాలడుగు భాస్కర్, హెచ్ఎంఎస్ నాయకులు రామారావు, ఐఎఫ్టీయూ నాయకుడు సూర్యం పాల్గొన్నారు.
అరెస్టులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం: ఎమ్మెల్యే కూనంనేని
తెలంగాణ బొగ్గు గనులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టొద్దని సింగరేణి కాలరీస్ వరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న నాయకులను అరెస్టు చేయడాన్ని సంఘం గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో ప్రజాఉద్యమాలను అడ్డుకునే చర్యలకు పాల్పడవద్దని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వేలాన్ని రద్దు చేయాలి: గిరిజన సమాఖ్య
సింగరేణి బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని మగ్ధూంభవన్‌లో తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా రామ్మూర్తినాయక్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాక్‌లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయకార్యదర్శి రమేశ్‌నాయక్, శంకర్‌నాయక్, రామ్‌చందర్‌నాయక్, స్వరూపబాయి, రమాదేవి, మాలోత్ శంకర్‌నాయక్, ధీరావత్ లింగానాయక్, లావుడియా దస్రునాయక్, జర్పుల శివనాయక్ (ప్రచండ), చత్రునాయక్, భరత్‌నాయక్ పాల్గొన్నారు.