మంచిర్యాల, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణి లాభాల వాటాలో కోత విధించిన కాంగ్రెస్ సర్కారుపై టీబీజీకేఎస్, కార్మిక లోకం కన్నెర్ర చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం నల్లనేలపై నిరసనలతో హోరెత్తించింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై టీబీజీకేఏస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్ ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. తాండూర్లోని ఏరియా స్టోర్స్ వద్ద టీబీజీకేఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధరావత్ మంగీలాల్ నేతృత్వంలో నిరసన తెలిపారు. మందమర్రి, కాసిపేట 1వ గని, కాసిపేట-2 ఇైంక్లెన్పై, బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని, ఖైర్గూడ ఓసీపీలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, ఏరియా ఉపాధ్యక్షుడు తుమ్మ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, చుంచుపల్లి మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆర్జీ-1, 2, 3 ఏరియాల్లో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించారు. ఆర్జీ-1లోని జీడీకే 1, 2, 2ఏ, 1 సీఎస్పీ, 11గని, ఓసీపీ 5, సివిల్ డిపార్టుమెంట్, వర్క్‌షాప్, రీజినల్ అనలైటికల్ ల్యాబ్, జీఎం కార్యాలయం, ఆర్జీ-2 పరిధిలోని అన్ని గనులు, డిపార్ట్మెంట్లపై, ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-1, సైటాఫీసు, ఓసీపీ-1 బేస్ వర్క్‌షాపు, ప్రాజెక్టు కార్యాలయాల్లో టీబీజీకేఎస్ ఆర్జీ-1, 2, 3 ఏరియాల ఉపాధ్యక్షులు వడ్డెపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, నాగెల్లి సాంబయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ బడితల సమ్మయ్య ఆధ్వర్యంలో భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని కేటీకే-1, కేటీకే-5, కేటీకే-6 ఇైంక్లెన్లు, ఓసీ గనులపై నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన చేపట్టారు. ఫిట్ సెక్రటరీలు సురేశ్, నరేశ్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రవితేజ, కార్మికులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ప్లాట్లు అలాట్మెంట్ చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమని డబుల్ బెడ్రూం లబ్ధిదారులు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. డబుల్ బెడ్రూం లబ్ధిదారుల కమిటీ అధ్యక్షుడు షేక్ నయీమ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన 804మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తూ పట్టాలిచ్చి పది నెలలు గడుస్తున్నదని, అధికారులు నేటికీ తమకు అలాట్మెంట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ధర్నా చేస్తున్నవారిని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కూడా డబుల్ బెడ్రూం లబ్ధిదారులు నిరసన చేపట్టారు.
పంట రుణమాఫీ చేయాలని సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ రైతులు కలెక్టరేట్లో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టి డీఆర్డీవో జయదేవ్ ఆర్యకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో రూ.2 లక్షలపైన ఉన్న రైతుకు రుణమాఫీ కాలేదని, రైతుభరోసా రాలేదని ఆవేదన వ్యక్తంచేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో రైతులు పంట పొలాల్లో పట్టా పాస్ పుస్తాకాలు పట్టుకుని సెల్ఫీ తీస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు.
తమకు రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రైతులు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను నిలదీశారు. ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులతో సమీక్షా సమావేశానికి హాజరై, బయటకు వస్తుండగా కన్నాపూర్, తదితర గ్రామాల రైతులు ఆయనను చుట్టుముట్టారు.
‘నా భూమిని వేరే వాళ్లకు పట్టా చేసిన్రు. తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇకనైనా న్యాయం చేయండి. లేదంటే ఇక్కడే పురుగుల మందు తాగి చస్తాం’ అంటూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన మండవ్గడే పత్రు తన కుటుంబ సభ్యులతో కలిసి పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాడు. ఈ సందర్భంగా పత్రు మాట్లాడుతూ గుండాయిపేట శివారులో సర్వే నంబర్ 167/28లో 5 ఎకరాల భూమి ఉందని, గతేడాది దానిని ఎల్ములే బావువ్రావు పేరిట పట్టా చేశారని ఆరోపించాడు. తహసీల్దార్ పుష్పలత వచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, కార్మిక సంఘాల జేఏసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి వీరన్న అధ్యక్షతన కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు.
306 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులే ఉంటే బోధన ఎలా సాగుతుందంటూ జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆరగిద్ద ప్రాథమిక పాఠశాలకు సోమవారం విద్యార్థులు, తల్లిదండ్రులు తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గతంలో ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేసేవారన్నారు. బదిలీల్లో నలుగురు వెళ్లిపోగా.. ఇద్దరు మాత్రమే మిగిలారన్నారు. ఎంఈవో నరసింహులు దసరా తర్వాత విద్యావలంటీర్లను నియమించి బోధన కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హాలీంపాషా సంఘీభావం తెలిపారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటును ఉపసంహరించుకోవాలని సోమవారం దాదాపూర్ యువకులు నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని తెలిసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు ఎందుకు ఉత్సాహాన్ని చూపతున్నారని మండిపడ్డారు. మాజీ సర్పంచ్ కృష్ణ, గురుచరణ్‌దాస్, ఈశ్వర్, ఆంజనేయులు, వెంకటయ్య, శ్రీనివాస్, చెన్నయ్య, వెంగల్రావు, శివ, ఎండీ అబ్బూ, నరేశ్, యశ్వంత్, ఆనంద్‌గౌడ్ పాల్గొన్నారు.
రామగుండం థర్మల్ ప్లాంటులో సింగరేణి భాగస్వామ్యాన్ని ఒప్పుకునేది లేదని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) ప్రధాన గేటు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
అర్హు లైన వారికే రేషన్ షాపులు కేటాయించాలని సోమవారం జిల్లాలోని రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. మెరిట్ లిస్ట్ జాబితా విడుదల చేయకుండానే కొందరిని ఇంటర్వ్యూలకు పిలుస్తోందన్నారు. అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జీపీ కార్మికులు సోమవారం బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. సీఐటీయూ నేత సురేశ్ గొండ మాట్లాడుతూ పది నెలలుగా జీతాలు ఇవ్వకుంటే కార్మికులు కుటుంబాలను ఎలా పోషిస్తారని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోని కోస్గిలో విద్యార్థులకు వండుతున్న పురుగుల బియ్యాన్ని పరిశీలించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి.
రెండు నెలలుగా పింఛన్లు రావడం లేదంటూ వనపర్తి జిల్లా ఆత్మకూరులో సోమవారం వృద్ధులు, ఒంటరి మహిళలు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నెలలుగా పింఛన్ రాకపోతే ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.