పెద్దపల్లి, జనవరి 22(నమస్తే తెలంగాణ): సింగరేణిలో టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ వివాదంతో పాటు పలు అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం ప్రెస్మీట్లో వెల్లడించిన అంశాలను టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తప్పుబట్టారు. ప్రభుత్వరంగ సంస్థల పీఎస్యూఎస్ టెండర్లలో సాధారణంగా రెండు రకాల విధానాలుంటాయని, కానీ భట్టి కేవలం సర్టిఫికెట్ అవసరమయ్యే టెండర్లను మాత్రమే చూపించారని చెప్పారు. కోల్ ఇండియా సైట్ విజిట్ అనేది డీమ్డ్ ప్రొవిజన్ అని, బిడ్డర్ తనంతట తానుగా చూసుకోవాలని, ప్రత్యేకంగా అధికారి సర్టిఫికెట్ అకర్లేదనే విషయాన్ని గ్రహించాలని వివరించారు.
వందలాది ఇతర కంపెనీలు సెల్ఫ్ డిక్లరేషన్‌ను అనుమతిస్తున్నప్పుడు, ఇకడ మాత్రమే సర్టిఫికెట్ అడగడంపై విమర్శలు వస్తున్నాయన్నారు. సీఎంపీడీఐ నిబంధనలను 2025లో మార్చితే, డిప్యూటీ సీఎం భట్టి మాత్రం 2018, 2021 నాటి సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ పత్రాలను ప్రస్తావించారని చెప్పారు. సీఎంపీడీఐ మార్గదర్శకాల్లో సైట్ విజిట్ గురించి ఉన్నప్పటికీ, కోల్ ఇండియా తప్పనిసరి సర్టిఫికెట్ రూపంలో అడగడం లేదని వివరించారు.
2018 నుంచి ఆ నిబంధన ఉంటే, కేవలం 2025లో(కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక) అమలు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వాలు ఎందుకు సైట్ విజిట్‌ను అమలు చేయలేదో ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. పోటీని తగ్గించేందుకే టెండర్లలో కొత్త నిబంధన తెచ్చినట్టు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. కొందరికే మేలు చేసేలా ఉన్న ‘సెలెక్టివ్ అప్రోచ్’గా మారిందని ఆరోపించారు.