గోదావరిఖని ఆగస్టు 30: సింగరేణి కార్మికులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాకనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గోదావరిఖని పర్యటనకు రావాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం రూ.20 లక్షల వడ్డీలేని రుణం హామీలను అమలు చేస్తారో? లేదో? చెప్పాలన్నారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొంటారా? లేక కేంద్రంతో మాట్లాడి తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించేలా ఒప్పిస్తారా? అనేది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది సింగరేణి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిన నేపథ్యంలో కనీసం 4000 కోట్ల లాభాలు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడిచినా సింగరేణి లాభాలను ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. తక్షణమే లాభాలు ప్రకటించి ప్రతి కార్మికుడికి 35శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తారా? కార్మికులకు అప్పగిస్తారా? తేల్చిచెప్పాలన్నారు. ప్రభుత్వమే గనుల వేలంలో పాల్గొనాలని కొన్ని కార్మిక సంఘాలు కోరడం విడ్డూరమని, సింగరేణి యాజమాన్యంతో లోపాయికారితనంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నాయని ఆక్షేపించారు. సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మూర్తి, సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ కొమురయ్య, నాయకులు శ్రీనివాస్, పల్లె సురేందర్, సాయి, పులిపాక శంకర్, రోడ్డ సంపత్, గుండు శ్రావణ్, కొమురయ్య పాల్గొన్నారు. వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో టీబీజీకేఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీపై డిప్యూటీ సీఎం స్పష్టత ఇవ్వాలని, సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడిన రూ.29 వేల కోట్లను చెల్లించాలని, వెంటనే లాభాల వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : సింగరేణిలో బదిలీ వర్కర్లకు సంస్థ శుభవార్త చెప్పింది. 2,364 మందిని జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తున్నట్టు సీఎండీ బలరాం తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించనున్నట్టు వెల్లడించారు. సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో తొలుత బదిలీ వర్కర్లుగా తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆయా బదిలీ వర్కర్లు సంవత్సరంలో 190 రోజులు భూగర్భగనుల్లో, ఉపరితల గనులు, ఇతర విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహిస్తే వారిని జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేస్తారు. సీఎండీ బలరాం మాట్లాడుతూ.. జనరల్ మజ్దూర్లుగా ఎంపికైనవారు క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు.