గోదావరిఖని, సెప్టెంబర్ 22: సింగరేణి కార్మికులకు లాభాల చెల్లింపులో రాష్ట్ర ప్రభు త్వం చేసిన మోసానికి వ్యతిరేకంగా దశల వారీగా పోరాటాలు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 23న కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని, 24న రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, 25న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తామని వివరించారు. 26న కార్మికుల సంతకాల సేకరణతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు పంపిస్తారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోతే హైదరాబాద్ సింగరేణి భవన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య ఇతరులను నిందించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని రాజిరెడ్డి హితవుపలికారు.