జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): సింగరేణిలోని ఓపెన్‌కాస్టు గనుల్లో కార్మికులు మండుటెండల్లో విధులు నిర్వహిస్తున్నారని, ఎండ తీవ్రత నుంచి వారి ని కాపాడాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆ సంస్థ సీఎండీ బలరాం నాయక్‌ను కోరారు. ఈ మేరకు ఆయన సీఎండీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 28 నుంచి మే 2 వరకు ఎండలు తీవ్రంగా ఉంటాయని, 48 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించిందని, కోల్‌బెల్ట్ ఏరియాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఓపెన్‌కాస్టు గనుల్లో విధులు నిర్వర్తించే కార్మికులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయ ని, సింగరేణి సంస్థ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఓసీపీల్లో పనిచేస్తున్న కార్మికుల పని వేళలు మార్పు చేయాలని, మొదటి షిఫ్టు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, రెండో షిప్టు సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే మజ్జిగ ప్యాకెట్లను అదనంగా సరఫరా చేయాలని, ఓసీలో మరిన్ని రెస్ట్ షెల్టర్లను ఏర్పాటు చేసి కార్మికులకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా కొనసాగిన సమయంలో వేసవిలో ఓసీపీల్లో పనివేళల్లో మార్పులు చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. యాజమాన్యం ఎండల తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.