హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్ పాలనలో తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్.. రాష్ట్ర ఆర్థిక వృద్ధి తగ్గిపోవడమే నిదర్శనం.. కాగ్ నెలవారి నివేదికే ఇందుకు సాక్ష్యం’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఉద్ఘాటించారు. 2023-24లో సొంత పన్నుల ఆదాయం రూ. 1,24,146.19 కోట్లు కాగా, 2024-25లో రూ.1,24,054.38 కోట్లకు పడిపోయిందని, మొత్తంగా రూ. 91.81 కోట్లు తగ్గిపోవడంపై గురువారం ఎక్స్ వేదికగా ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
కొవిడ్ సమయంలో తప్ప రాష్ట్రంలో ఇంతటి తగ్గుదల ఎప్పుడూ కనిపించలేదని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లేని పాలనావిధానాలే ఇందుకు కారణమని విశ్లేషించారు. 2014-15 నుంచి 2022-23 వరకు బీఆర్ఎస్ హయాంలో 12 శాతం సొంత పన్నుల ఆదాయం వృద్ధి సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.