హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వ సూళ్ల గడువు ముగుస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఇంకా రూ.25.76 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. రూ.345.21 కోట్ల లక్ష్యంలో ఇప్పటివరకు రూ.319.45 కోట్లు(92.54%) మాత్రమే వసూలయ్యాయి. పంచాయతీ కార్యదర్శులపై అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తు న్నా కొన్ని జిల్లాల్లో వసూళ్లు మందగించాయి. కూలిపోయి శిథిలావస్థలో ఉన్న వందల ఏండ్లనాటి ఇండ్ల్లతోపాటు ఖాళీగా ఉన్న ఇండ్లకు సైతం ఆన్లైన్ పోర్టల్ డాటా ఆధారంగా పన్నులు వడ్డించడం వల్లే బకాయిలు పేరుకుపోతున్నాయనే విమర్శలున్నాయి.
పన్ను వసూళ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా 100శాతంతో రికార్డు సృ ష్టించగా, ఉమ్మడి వరంగల్ అత్యంత వెనుకబడి చివరి స్థానంలో ఉన్నది. రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూళ్లు తుది దశకు చేరినా చాలాజిల్లాలో 100% వసూలు కాలేదు. అధికారిక హౌస్‌ట్యాక్స్ డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్(డీసీబీ) నివేదిక ప్రకారం రూ.25.76 కోట్లు వసూలు కావాల్సి ఉన్నది. నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఉన్నతాధికారులు కార్యదర్శులను పరుగు పెట్టిస్తున్నారు.
ఆస్తి పన్ను వసూళ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా రూ.7.96 కోట్ల డిమాండ్‌కు గాను రూ.7.96 కోట్ల(100శాతం) వసూళ్లతో ప్ర థమ స్థానంలో నిలిచింది. జగిత్యాల జిల్లా 99.40%(రూ.13.57 కోట్లు), సిద్దిపేట 99.35% (రూ.14.94 కోట్లు) వసూళ్లతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. వరంగల్ జిల్లా రూ.4.97 కోట్ల డి మాండ్‌కు గాను రూ.4.04 కోట్ల (81.21%) వసూళ్లతో చివరి స్థానంలో ని లువగా మహబూబాబాద్ జిల్లా రూ.5.37 కోట్లలో రూ.4.44 కోట్ల (82.71%) వసూళ్లతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
వరంగల్, మహబూబాబాద్ జిల్లా ల్లో ఇంకా రూ.93 లక్షల చొప్పున వసూలు కావాల్సి ఉన్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 88.03%, నాగర్‌కర్నూల్ జిల్లాలో 88.08%, సూర్యాపేట జిల్లాలో 88.82% వసూలైంది. అత్యధికంగా ఆస్తి పన్ను డి మాండ్ ఉన్న రంగారెడ్డి జిల్లాలో 33.74 కోట్లకు గాను రూ.30.64కోట్లు (90.81 %), నిజామాబాద్ జిల్లాలో రూ.28.20 కోట్లకుగాను రూ.25.50 కోట్లు(90.43%) వసూలయ్యాయి.
గ్రామాల్లో ఎప్పుడో శిథిలావస్థకు చేరిన ఇండ్లు, నివాసయోగ్యంగా లేని ఇండ్లతోపాటు చాలా ఏండ్ల నుంచి తాళాలు వేసి ఉన్న ఇండ్లకూ పన్నులు వసూలు చేయాలని చూస్తున్నారు. 2020లో చేసిన నాన్-అగ్రి ప్రాపర్టీ బుక్(ఎన్పీబీ) సర్వేలో ప్రతి ఇంటినీ ఫొటో తీసి ఈ-పంచాయతీ పోర్టల్‌లో ఆన్లైన్ చేశా రు. అప్పటినుంచి ఆ రికార్డుల ఆధారంగానే ప న్నులు వేస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఆ ఇండ్లు శిథిలావస్థకు చేరి కూలినా రికార్డుల నుంచి తొలగించకపోవడంతో ఏటా వాటి పన్ను బకాయిలు రికార్డుల్లో మిగిలిపోతున్నాయి.
శిథిలావస్థలో ఉన్న ఇండ్ల్లను రికార్డుల నుంచి తొలగించడం పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ప్రహసనంగా మారింది. మొదట గ్రామంలో ఎన్ని ఇండ్లు శిథిలావస్థలో ఉన్నాయో గుర్తించి, గ్రామసభలో తీర్మానం చేయాలి. దాన్ని డీపీవోకి పంపాలి. అకడినుంచి అది పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి చేరి కమిషనర్ తుది నిర్ణయం మేరకు రికార్డుల నుంచి తొలగిస్తారు. ఈ సుదీర్ఘ ప్రక్రియ వల్ల రికార్డులు ఏండ్ల తరబడి అప్డేట్ కావడం లేదు. మరోవైపు గతంలో గుడిసెలు, పెంకుటిండ్లు ఉన్నవారు ప్రస్తుతం వాటి స్థానంలో పెద్ద భవనాలు నిర్మించుకున్నా ఇంటి పన్ను విలువలో మార్పులు చేయడం లేదని, పాత పన్నులనే కొనసాగిస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు చెప్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నదని, మరోవైపు ఉనికిలో లేని ఇండ్ల్లకు పన్ను విధిస్తూ వసూళ్ల కోసం తమపై ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు.