హైదరాబాద్ సిటీబ్యూరో/శంషాబాద్ రూరల్, డిసెంబర్ 26: ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆటో డ్రైవర్లు, ఇతర కార్మికులు ఉపాధి కోల్పోయారు.. ఈ పథకంపై పునరాలోచించాలి.. వారంలోగా ఆటో కార్మికులకు సరైన న్యాయం చేయాలి’ అని బీఆర్టీయూ అనుబంధ సంస్థ అయిన టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య వేముల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ పట్టణంలోని ఆటో కార్మికులతో సమావేశమై, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ఆటో కార్మికుల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని నివేదికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. సమావేశంలో సంఘం మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏర్పుల బాల్రాజ్, మాసాయిపేట మండల అధ్యక్షుడు అశోక్, చేగుంట మండల అధ్యక్షుడు యాదగిరితోపాటు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఆటో కార్మికులకు ఉపాధి చూపకుండా మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తెచ్చిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శంషాబాద్ పట్టణంలో బీఎంఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఎలాంటి స్పందన రావడం లేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికుల కుటుంబాలను ఆగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆటో కార్మికుల ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు ఎండీ సయ్యద్, రవి, శ్రీను, జగదీశ్, శివ, దర్శన్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.