న్యూఢిల్లీ, జూన్ 11: ఆధార్ ధృవీకరణ పొందిన యూజర్లకు మాత్రమే తత్కాల్ రైలు టికెట్లు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ నిర్ణయాన్ని అన్ని జోన్లకు తెలియజేస్తూ రైల్వే శాఖ ఓ సర్క్యులర్ జారీచేసింది. తత్కాల్ పథకం ప్రయోజనాలను సాధారణ వినియోగదారులు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అలాగే జూలై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ బేస్డ్ ఓటీపీ తప్పనిసరి చేసినట్టు వెల్లడించింది.
రైలు టికెట్ బుకింగ్‌లో ‘వెయిటింగ్ లిస్ట్’లోని ప్రయాణికులకు 4 గంటల ముందు టికెట్ ఖరారు చేస్తున్న ప్రస్తుత పద్ధతిని కేంద్రం మార్చాలని భావిస్తున్నది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల టికెట్ ఖరారు.. 24 గంటల ముందుగా చేపట్టాలన్న కొత్త విధానంపై ‘ట్రయల్స్’ చేపట్టినట్టు రైల్వే శాఖ బుధవారం తెలిపింది. ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన వచ్చిన తర్వాతే పైలట్ ప్రాజెక్ట్.. కొత్త విధానంలో భాగమవుతుందని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు. ‘ప్రస్తుతం 4 గంటల ముందు చార్ట్ సిద్ధమవుతున్నది. దీనికి బదులుగా రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు.. చార్ట్‌ను ప్రిపేర్ చేయడాన్ని బికినీర్ డివిజన్లో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాం’ అని రైల్వే బోర్డ్ అధికారి దిలీప్ కుమార్ చెప్పారు. ‘24 గంటల ముందు టికెట్ ఖరారు చేయటం వల్ల రైలు ప్రయాణంపై సందిగ్ధత వీడుతుందని భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు.