వేలేరు : జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలైన వేలేరు, చిల్పూరు, తరిగొప్పుల మండలాల ప్రజలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ఆదివారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాదయాత్ర చేపట్టగా, హనుమకొండ జిల్లా వేలేరులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసమే రాజయ్య పాదయాత్ర చేపడుతున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. దేవాదుల పైప్‌లైన్ మూడో దశ పనులు పూర్తయితే బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కడియం శ్రీహరి పైప్‌లైన్ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
రైతు సమస్యలు విస్మరించి రాజకీయ ప్రయోజనాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. యూరియా కొరతపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించగా, గండ్ర హాజరై మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులకు యూరియా, విత్తనాల కొరత లేకుండా చూడాలని డిమాండ్‌చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అసెంబ్లీలో యూరియాపై తీర్మానం చేసి రైతులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో గద్దె దిగి పోవాలని డిమాండ్ చేశారు.
– రేగొండ
రేవంత్ సర్కారులో అన్నదాత అరిగోస పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడెపల్లి పీఏసీఎస్ కు 445 బస్తాల యూరియా రాగా టోకెన్ల కోసం రాంపూర్ రైతు వేదిక వద్ద తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి రాంపూర్ చేరుకుని యూరియా దిగుమతిపై ఏవోను ప్రశ్నించారు. యూరియా విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంలో చూపిస్తున్న శ్రద్ధ రైతులకు యూరియా అందించడంలో చూపకపోవడం బాధాకరమన్నారు. అన్ని వర్గాల ప్రజలు మరో మార్పుతో రేవంత్ సర్కారుకు గుణపాఠం చెప్పబోతున్నారని తెలిపారు.
– నల్లబెల్లి