హైదరాబాద్ : ఫిరాయింపుల్లో ముందు వరుసలో ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఏ పార్టీలో ఉన్నానో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీలో చేరానని స్వయంగా కడియం శ్రీహరి చెప్పారు. అభివృద్ధి కోసమే పార్టీ మారారని కడియం అంటున్నారు. కడియం శ్రీహరి అప్రూవర్‌గా మారారు. కడియం శ్రీహరికి అభివృద్ధి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు.
15 ఏళ్లు మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అభివృద్ధి గుర్తుకు రాలేదా అని నిలదీశారు. తన బిడ్డను ఎంపీ చేయడం కోసం కడియం శ్రీహరి పార్టీ మారారు. తన రాజకీయ సమాధిని తానే కట్టుకున్నారన్నారు. ఆయన విదేశాల్లో ఆస్తులు సంపాదించుకున్నారు, హైడ్రల్ ప్రాజెక్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా పోస్టులు అమ్ముకున్నారు. కడియం శ్రీహరి అభివృద్ధి కావడం తప్పా స్టేషన్ ఘన్ పూర్‌ను అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
జస్టిస్ బి.ఆర్.గవాయ్ మూడు నెలల గడువు ఇచ్చి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చారు. స్పీకర్ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. అంబేద్కర్ పైన గౌరవం ఉంటే స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు వింటే స్పీకర్ కోర్టు ధిక్కరణ కిందకు వస్తారు. కడియం శ్రీహరి అంటే అవినీతి తిమింగలం అని మండిపడ్డారు. కాంట్రాక్టర్ల నుంచి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు. బినామీ పేర్లతో కడియం శ్రీహరికి ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ మారతనని కడియం శ్రీహరి కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేశారని విమర్శించారు. కడియం శ్రీహరికి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.