ఖమ్మం, మే 2 : ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, బలగాలను వెంటనే ఉపసంహరించాలని కోరారు. అఖిలపక్ష పార్టీలతోపాటు ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక హక్కుల వేదికల ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన మానవహారంలో తాతా మధు మాట్లాడారు. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, కాల్పుల విరమణ పాటించాలని మావోయిస్టు పార్టీ నేతలు లేఖల ద్వారా కోరినా కనీస స్పందనలేకపోవడం మోదీ నిరంకుశపాలనకు నిదర్శనమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఫైల్ ముందుకు కదిలింది. శుక్రవారం మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఫైల్‌ను సెక్షన్ ఆఫీసర్ డీహెచ్‌కు పంపినట్టు తెలిసింది. ఇదే విషయమై కొంతమంది ఉద్యోగులు సెక్రటేరియట్‌కు వెళ్లి ఆరా తీయగా, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ తుదిదశకు చేరిందని.. వచ్చే వారంలో ఆర్డర్స్ ఇస్తామని అధికారులు చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ ‘మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్‌కు మోక్షమెన్నడు?’ అనే కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియను వేగవంతం చేసినట్టు సమాచారం.