ఖమ్మం, నవంబర్ 5 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న పత్తికి మద్దతు ధర ప్రకటనలకే పరిమితమైందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం ఏఎంసీ మాజీ చైర్మన్ గుండాల కృష్ణ తదితరులు మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి క్రయవిక్రయాలను పరిశీలించారు. పత్తి రైతులు బీఆర్ఎస్ నాయకులకు పంటను చూపించి బాధలు చెప్పుకునేందుకు బారులు తీరారు. కొందరు కంటతడి పెట్టారు. దాదాపుగా 40 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తిసాగు చేశానని, తీరా పంటను మార్కెట్కు తెస్తే క్వింటాకు రూ.6,500 మించి ధర పెట్టడం లేదని ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు తండాకు చెందిన మాళోత్ కాళిదాసు వాపోయాడు.
రఘునాథపాలెం మండలం మంగ్యాతండాకు చెందిన యువరైతు బానోత్ రవి కూడా తన గోడు వెళ్లబోసుకున్నాడు. తాను 14 బస్తాల పంటను తెస్తే కనీసం పంటను చూసేందుకు ఒక్క వ్యాపారి కూడా రావడం లేదని కన్నీరుపెట్టుకున్నాడు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జిల్లాలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. మద్దతు ధరల విషయంలో జిల్లాలోని ముగ్గురు మంత్రులు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారని విమర్శించారు.
సీసీఐ కొర్రీలతో రైతుల పంట మొత్తం ప్రైవేటుకు వెళ్తున్నదని ఆరోపించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. పత్తి రైతులకు క్వింటాకు రూ.వెయ్యి చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి పెద్ద రైతు అయి ఉండి కూడా రైతుల బాధలను పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. అనంతరం జిల్లాలో పత్తి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరు తూ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్కు వినతిపత్రం అందజేశారు.