అక్రమాల నేపథ్యంలో దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి రూ.300 కోట్ల జరిమానా విధిస్తూ రాష్ట్ర పర్యావరణ శాఖ నోటీసులు పంపింది. ఆ నోటీసులతో బిత్తరపోయిన కంపెనీ యాజమాన్యం పలువురు ప్రభుత్వ పెద్దల వద్ద మొరపెట్టుకున్నట్టు సమాచారం. దీంతో బంతి తన కోర్టులోకి వచ్చిందని నిర్ధారించుకున్న ఓఎస్డీ సుమంత్.. కంపెనీ యాజమాన్యంతో బేరసారాలు చేసినట్టు చెప్పుకుంటున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress Govt) ‘మైనింగ్’ ముసలం పుట్టింది. ఇన్నాళ్లూ గుట్టుగా సాగిన విచ్చలవిడి అవినీతి పుట్ట పగిలింది. మంత్రుల మధ్య వివాదాలు, కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి, మేడారం టెండర్లు.. ఇలా కొన్నిరోజులుగా బయటికి వచ్చినవన్నీ వానపాములే. కానీ, తెరవెనక అవినీతి అనకొండలు ఉన్నట్టు మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంతో బయటపడింది. మేడారం టెండర్ల నేపథ్యంలో మంత్రుల మధ్య విబేధాలు బయటపడినట్టు కనిపిస్తున్నా.. ఈ ఎపిసోడ్ మొత్తం ముఖ్యనేత, కొండా సురేఖ చుట్టే తిరిగిందని ప్రచారం జరుగుతున్నది. సూర్యాపేట జిల్లాలోని సున్నపురాయి గనులను నిబంధనలకు విరుద్ధంగా రెండు సిమెంటు కంపెనీలకు కట్టబెట్టడంతో చెలరేగిన రూ.వందల కోట్ల ముడుపుల వ్యవహారమని తేటతెల్లం అవుతున్నది. ప్రస్తుతం గనుల శాఖను వివేక్ వెంకటస్వామి నిర్వహిస్తున్నా.. మూడు సున్నపు గనుల లీజు ఈ-వేలం జరిగిన ఆగస్టు 2024లో ఆ శాఖ ముఖ్యనేత వద్దే ఉన్నది. టెండర్లను మూడు కంపెనీలకు అప్పగించే క్ర మంలో గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం(ఎంఎండీఆర్)ను తుంగలో తొ క్కారని సమాచారం. ఈ క్రమంలో జరిగిన వ సూళ్ల, పంపకాల తేడాతో వ్యవహారం రచ్చకెక్కినట్టు చెప్తున్నారు. ఈ తతంగంపై ‘నమస్తే తెలంగాణ’ ఈ ఏడాది మార్చి 12న ‘గనుల నిబంధనలకు సున్నం… రాష్ట్ర ఖజానాకు సున్నం.. హద్దులు దాటిన పెద్దల బేరం’ శీర్షికన కథనం ప్రచురించింది. తాజా పరిణామాలపై సురేఖ కూతురు సుస్మిత సెల్ఫీవీడియో ద్వారా అందించిన వివరాలతో తీగ లాగితే హుజూర్‌నగర్‌లోని సున్నపురాయి నిక్షేపాల డొంక కదులుతున్నదని స్పష్టమవుతున్నది.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా నదీ తీరం వెంట ఉన్న రిజర్వు ఫారెస్టులో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. పసుపులబోడు, సైదుల్నామా, సు ల్తాన్‌పూర్ అనే మూడు బ్లాకుల్లో సున్నపురాయి నిక్షేపాల మైనింగ్ లీజు వేలం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి తీసుకుని టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కానీ నిబంధనలను తుంగలో తొక్కింది. ఎంఎండీఆర్ చట్టం ప్రకారం నోటిఫికేషన్లోనే ఆయా ఖనిజ నిక్షేపాలున్న ప్రాంతంలో పలానా అక్షాంశాలు, రేఖాంశాలు హద్దులుగా ఉన్న(డీజీపీఎస్ కార్న ర్ పాయింట్లు) ప్రాంతంలో మైనింగ్ లీజుకు ఇస్తున్నట్టు స్పష్టం చేయాలి. తద్వా రా ప్రభుత్వం నిర్దేశించిన హద్దుల్లోనే టెండర్ దక్కించుకున్న కంపెనీలు మైనింగ్ చేయాల్సి ఉంటుంది. వీటిని ఈ-టెండర్ నోటిఫికేషన్ లో జత చేయడం వల్ల కంపెనీలు వాటిని గు ర్తించి టెండర్లలో పాల్గొనడం ద్వారా పోటీ పె రుగుతుంది. కానీ, సర్కారు మాత్రం ముందుగానే రెండు కంపెనీలకు రెండు బ్లాకులను కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈ-టెండర్లలో డీజీపీఎస్ కార్నర్ పాయింట్లను పొందుపరచలేదని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు బ్లాకులకు కంపార్టుమెంట్లు (అటవీ ప్రాంత విభజన ప్రాంతం) కూడా ఇవ్వలేదని సమాచారం.
ఈ-టెండర్లలో భాగంగా సుల్తాన్పూర్ బ్లాక్‌కు వేలం జరిగింది. మొత్తం విస్తీర్ణం 4,260.09 ఎకరాలు. దీనిని 11, 12, 13, 14, 804 కంపార్టుమెంట్లుగా విభజించారు. ఇందులో కేవలం 337.76 ఎకరాల్లో మాత్ర మే మైనింగ్ లీజుకు వేలం వేశారు. దీనికి కూడా కంపార్టుమెంట్ నంబరు గానీ, ఈ విస్తీ ర్ణం ఎక్కడ ఉంటుంది? దాని డీజీపీఎస్ కార్న ర్ పాయింట్లు ఏవి అనేది పేర్కొనలేదు. ఇదే బ్లాకులో నాగార్జున సిమెంట్స్ లిమిటెడ్ యథేచ్చగా అక్రమ మైనింగ్ చేస్తున్నదని మరో సామాజిక కార్యకర్త వెంకట్‌రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు ప్రస్తుతం పెం డింగ్‌లో ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాం లో ఇదే అంశంపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపారు. సుల్తాన్పూర్ రిజర్వు ఫారెస్టులో ఎన్సీఎల్ అనుమతికి మించి సున్నపురాయి నిక్షేపాలను తవ్వుతున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆ నివేదికలోని సిఫారసు మేరకు రాష్ట్ర గనులు, భూ గర్భ శాఖ 2021లోనే ఆ కంపెనీకి రూ.91.42 కోట్ల జరిమానా కూడా విధించింది. అయితే తాజా ఈ-టెండర్లలో ఎన్సీఎల్ సరిగ్గా ఇదే బ్లాకుకు బిడ్ దాఖలు చేసి మైనింగ్ లీజు దక్కించుకోవడం గమనార్హం. కానీ మిగిలిన రెండు బ్లాకుల జోలికి వెళ్లలేదు.
ఈ-వేలం చేపట్టిన మరో బ్లాకు పసుపులబోడు. దీని మొత్తం విస్తీర్ణం 2,490.52 ఎకరాలు. దీనిని 29, 30, 31 బ్లాకులుగా విభజించారు. ఈ-వేలం విస్తీర్ణం 343.20 ఎకరాలు. కానీ, నోటిఫికేషన్లో దీనికి మాత్రం కంపార్టుమెంట్-29 అని సూచించారు. ఈ బ్లాకులో అక్రమ మైనింగ్ చేశారనే ఆరోపణలు ఏ సిమెంటు కంపెనీపై నా లేవు. ఈ-టెండర్లలో ఈ బ్లాకుకు సంబంధించిన డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు ఇతర అన్ని వివరాలను పొందుపరిచారు. అయినా నిబంధనల ప్రకారం బిడ్లు దాఖలు కాలేదని అధికారులు టెండరు రద్దు చేసినట్టు తెలిసింది. అంటే అభియోగాలున్న బ్లాకులకేమో చట్టానికి అనుగుణంగా వివరాలివ్వలేదు. ఆ బ్లాకుల్లో అక్రమ మైనింగ్ చేశారనే కేసులు ఉన్న కంపెనీలకే మైనింగ్ లీజు దక్కింది. పోటీలేని బ్లాకుకేమో చట్టానికి అనుగుణంగా వివరాలిచ్చారు. అయినా బిడ్లు రాలేదు. దీంతో ఏదో మతలబు ఉన్నట్టు అర్థమవుతున్నది.
అటవీ ప్రాంతంలో ఉన్న సున్నపురాయి నిక్షేపాలకు అటవీ శాఖ ఎన్వోసీ తీసుకోవాలి. కానీ రేవంత్ సర్కారు గతేడాది మూడు బ్లాకుల లీజు ఈ-వేలంలో మాత్రం ఎన్వోసీ లేదు. ఇదే అంశంపై వెంకట్‌రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో అటవీ శాఖకు సమాచార హక్కు కింద దరఖాస్తు చేయగా ఎన్వోసీ జారీ చేయలేదని జిల్లా అటవీ శాఖ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇదేకాదు… అసలు మూడు బ్లాకులకు డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు, కంపార్టుమెంట్ల వివరాలు ఇవ్వాల్సిందిగా వెంకట్‌రెడ్డి దాదాపు ఏడాది కిందట గనుల శా ఖకు దరఖాస్తు చేశారు. కానీ సమాచార హక్కు చట్టం-8(ఏ), (డీ), (ఈ), (జీ), (ఐ) ప్రకా రం సమాచారం ఇవ్వలేమని భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(న్యాయ) ఆర్రామకృష్ణారెడ్డి బదులి చ్చారు. వ్యక్తుల ప్రాణాలకు హాని ఉన్నపుడు సమాచారాన్ని బహిర్గతం చేయవద్దని ఈ సెక్షన్లు చెప్తున్నాయి. కానీ ఇదే శాఖ పది రోజుల కిందట డీజీపీఎస్ కార్నర్ పాయింట్ల వివరాలను ఇచ్చింది. అసలు కంపార్టుమెంట్ల నంబర్లను సూచించలేదని అంగీకరించింది.
ఎంఎండీఆర్-2015ను ఉల్లంఘించి లీజు ఈ-వేలం నిర్వహించారని వెంకట్‌రెడ్డి గత ఏడాది డిసెంబర్ 20న కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. కేంద్ర గనుల శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్రమ మైనింగ్ ఆనవాళ్లు చెరిపివేసేందుకే ఈ-వేలంలో అవకతవకలు చేశారని, ఇది రూ.1500 కోట్ల స్కాం అని పేర్కొన్నారు. అయితే మూడు నెలలు గడిచినా జవాబు లేదు. ఆ ఫిర్యాదును రాష్ట్ర గనుల శాఖకు పంపినట్టు సమాధానం ఇచ్చి చేతులు దులుపుకొన్నది.
సైదుల్నామా సున్నపురాయి గనులు ఉన్న బ్లాకు మొత్తం విస్తీర్ణం 3,102.58 ఎకరాలు. వీటిని 25, 26, 27 కంపార్టుమెంట్లుగా విభజించారు. ఇందులో దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ ఇష్టానుసారంగా సున్నపురాయి నిక్షేపాల్ని అనుమతి లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్నదనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఈ మేరకు కోటేశ్వరరావు అనే సామాజిక కార్యకర్త గతంలోనే హైకోర్టులో కేసు వేశారు. అధికారుల విచారణలోనూ అక్రమ మైనింగ్‌ను గుర్తించి భారీ ఎత్తున జరిమానా కూడా విధించినట్టు తెలుస్తున్నది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్లాకులో 412.90 ఎకరాల్లో సున్నపురాయి గనుల మైనింగ్ కోసం ఈ-వేలం చేపట్టింది. కానీ, మూడువేలకుపైగా ఎకరాలుగా ఉన్న అటవీభూమిలో ఈ 412.90 ఎకరాలు ఎక్కడ ఉంటుంది, ఏ కంపార్టుమెంటు, దాని డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు ఏమిటనేది మాత్రం నోటిఫికేషన్లో పేర్కొనలేదు. దక్కన్ సిమెంట్ కంపెనీ సరిగ్గా ఈ బ్లాకుకు మాత్రమే బిడ్ దాఖలు చేసి, మైనింగ్ లీజు దక్కించుకున్నది. మిగతా రెండు బ్లాకుల జోలికి వెళ్లలేదు.
దక్కన్ సిమెంట్ కంపెనీపై అక్రమ మై నింగ్ వ్యవహారంలో భారీ జరిమానా పడినట్టు సమాచారం. మైనింగ్‌లో గనుల తో పాటు అటవీ శాఖకు కూడా సం బంధం ఉంటుంది. కంపెనీల వ్యవహారంపై కొంతకాలం కిందట మంత్రి కొండాకు ఉప్పందడంతో ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. ఈక్రమంలోనే సుమంత్ రంగంలోకి దిగి కంపెనీతో డీల్‌కు ప్రయత్నించాడనే ఆరోపణలున్నాయి. అయితే, గతంలోనే అంతా సర్దుబాటు చేసినా, మళ్లీ ఇదేమిటని కంపెనీ వాళ్లు ఓ మంత్రితో వాపోవడంతో విషయం ‘ముఖ్యనేత’ దాకా వెళ్లినట్టు తెలిసింది. ‘ముఖ్యనేత’ సూచనతో రోహిన్‌రెడ్డి రంగప్రవేశం చేశారని, దక్కన్ కంపెనీ వాళ్లతో సుమంత్‌ను కూర్చోబెట్టి సెటిల్ చేసే ప్రయత్నం చేసినట్టు సురేఖ కుమార్తె సుస్మిత వెల్లడించిన వివరాల ద్వారా అర్థం అవుతున్నది. రోహిన్‌రెడ్డి చెప్పినా సురేఖ వెనక్కి తగ్గకపోవడంతో ముఖ్యనేత సీరియస్‌గా తీసుకొని టార్గెట్ చేసినట్టు చర్చ జరుగుతున్నది. ఈ పరిణామాల వల్లే మేడారం పనుల్లో సురేఖను దూరం పెట్టడం, ఓఎస్డీని తొలగించి మంగళవారం రాత్రి కొండా నివాసానికి పోలీసులను ఉసిగొల్పినట్టు స్పష్టమవుతున్నది. దీనిపై కేంద్రం స్పందించాలని, మంత్రి కిషన్‌రెడ్డి వద్ద ఫిర్యాదు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు చే యాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.