హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాలు, దవాఖానల్లో వసతుల కల్పనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్చోంగ్తు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. టాస్క్ఫోర్స్లో డీఎంఈ సభ్యకార్యదర్శిగా , డీఎంఈ(అకడమిక్), హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్, ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియను టాస్క్ఫోర్స్ పర్యవేక్షించనున్నది. బయోమెట్రిక్ అటెండెన్స్, ఓపీ, ఐపీ, మాతాశిశు సంరక్షణ సేవలు, పోస్టుమార్టం విభాగాల్లో వసతులపై నిశితంగా పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది.
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): వర్సిటీల్లో 60 ఏండ్లు పూర్తిచేసుకున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను తిరిగి కొనసాగించాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాంవెంకటేశ్ అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లకు లేఖ రాశారు. 12 వర్సిటీల్లో 900 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ఇటీవల 60 ఏండ్లు పూర్తిచేసుకున్న 15 మంది పదవీ విరమణ పొందారు. ఇదే విషయాన్ని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘క్రమబద్ధీకరణ కలేనా’ అన్న శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పదవీ విరమణ పొందుతుండటంతో వర్సిటీల్లో బోధన గాడి తప్పుతోందని సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన విద్యాశాఖ 60 ఏండ్లు పూర్తిచేసుకున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కొనసాగించాలని ఉత్తర్వులిచ్చింది.
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలను అక్టోబర్ మొదటివారంలో నిర్వహిస్తామని డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యేవారు 30 లోగా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 9లోగా ఫీజును చెల్లించవచ్చని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : భార రహిత, ఒత్తిడిలేని చదువులనందించేందుకు అమలుచేస్తున్న ‘నో బ్యాగ్డే’ను రాష్ట్రంలోని అన్ని బడుల్లో శనివారం జరపనున్నారు. ప్రతి నెల మూడో శనివారం ‘నో బ్యాగ్డే’ అమలుచేయాలని గతంలోనే పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ కరదీపికలను ముద్రించింది.