సుబేదారి, మే 4 : దుబాయిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించిన ముగ్గురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండలోని సుబేదారి టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ వైభవ్‌గైక్వాడ్ బుధవారం నిందితుల వివరాలు వెల్లడించారు. దుబాయిలోని బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వరంగల్ నగరానికి చెందిన ఎండీ ఇర్ఫాన్, ఎండీ అర్షద్ పాషా, ఎండీ ఖాసిం పలువురు యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. వారిని దుబాయికి పంపి అక్కడ ఓ అపార్ట్మెంట్లో బంధించారు.
మూడు నెలల తర్వాత ఎటువంటి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. అర్షద్, ఖాసింను నిలదీయడంతో ఇండియాకు పంపించారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బాధితులను తీవ్రంగా హెచ్చరించారు. అర్షద్, ఖాసిం బాధితుల సర్టిఫికెట్లతో బ్యాంకు ఖాతాలు తీసి లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారు. ఈ విషయం బాధితులకు తెలియడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం నగరంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 1.50 లక్షల నగదు, నకిలీ కాల్ లెటర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లే వారు ఏజెంట్ల పూర్వాపరాలు తెలుసుకోవాలని అడిషనల్ డీసీపీ వైభవ్‌గైక్వాడ్ సూచించారు. కేసులో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీనివాస్‌జీ, సంతోష్, ఎస్సై ప్రేమానందం, సిబ్బందిని ఆయన అభినందించారు.