మిర్యాలగూడ, మార్చి 5: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, సొరంగమార్గం తవ్వేప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌తో కలిసి బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ర్టానికి ప్రమాదకరంగా మారబోతున్న బీజేపీ విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని తెలిపారు. మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందాలని బీజేపీ చూస్తున్నదని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.