Tammineni Veerabhadram | గజ్వేల్, డిసెంబర్ 1: ఎన్నికల హామీల అమలు కోసం రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజల పక్షాన పోరాటం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఫ్రీ బస్సు తప్ప ఒక్కటీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు కూడా విమర్శలు చేస్తున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన సీపీఎం జిల్లా మూడో మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో హామీలకు ఆకర్షితులై ఓట్లు వేస్తే ప్రజల ఆశలు ఆవిరయ్యాయని మండిపడ్డారు. లగచర్ల ఘటనలో సాగుభూములు తీసుకునేది, కేసులు నమోదు చేయించేది, ప్రజలపై అఘాయిత్యాలకు పాల్పడేది ప్రభుత్వమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
లగచర్ల భూముల్లో తొండలు గుడ్లు పెట్టవని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారని, కానీ, అక్కడి రైతులు సాగు చేసుకొని బతుకుతున్నామని చెప్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాటు చేసే కంపెనీలకు సాగుయోగ్యంగా లేని బండరాళ్లతో ఉన్న భూములను మాత్రమే తీసుకోవాలని సూచించారు. అదే ప్రాంతానికి చెందిన గురున్నాథ్రెడ్డికి 1,156 ఎకరాల భూమి ఉన్నదని, సీలింగ్ చట్టం ప్రకారం ఆ భూమిని ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం లేకుండా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొవడం కరెక్ట్ కాదని కుండబద్దలు కొట్టారు. హైడ్రా, మూసి పేరుతో ఎస్సీ, ఎస్టీ ఇండ్లను కూల్చుతున్నారని, ప్రభుత్వంపై ప్రజా పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.
అదానీతో ఒప్పందాలు బయటపెట్టాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనలో అదానీతో రూ.12,400 కోట్లతో ఏడు ఎంవోయూలు కుదుర్చుకున్నారని, రాష్ట్రంలో అంబుజా సిమెంట్, సోలార్ కరెంట్‌పై చేసుకున్న ఒప్పందాలను బయటపెట్టాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ ఒకవైపు అదానీని వ్యతిరేకిస్తుంటే, స్కిల్ యూనివర్సిటీకి కోసం రేవంత్‌రెడ్డి అదే అదానీ నుంచి రూ.రూ.100 కోట్ల చెక్కు తీసుకున్నారని విమర్శించారు. మహాసభలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు పోరాటాలతోనే లగచర్ల ఫార్మాసిటీ, నిర్మల్ ఇథనాల్ ఫ్యాక్టరీలపై ప్రభుత్వం వెనక్కి: బీవీ రాఘవులు రైతుల పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం లగచర్ల ఫార్మాసిటీ, నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటుపై వెనకి తగ్గిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీ స్థానంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామంటూ రైతుల నుంచి భూములు లాక్కునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త ట్రిక్కులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్, సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయాల్లో మీడియాతో మాట్లాడుతూ.. ఫార్మా అయినా, ఇండస్ట్రియల్ పార్కు అయినా రైతుల భూములను లాక్కోవాలని ప్రభుత్వం చూడటం, సీఎం రేవంత్‌రెడ్డి ఇంత పట్టుదలకు పోవడం సరికాదని హితవు చెప్పారు. లగచర్లలో రైతులు పంటలు పండిస్తున్న భూముల సేకరణను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. భూ సేకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం విషయంలో వామపక్షాలు వెనక్కితగ్గేది లేదని స్పష్టంచేశారు. రాహుల్‌గాంధీ ఒత్తిడి వల్లనే సీఎం రేవంత్‌రెడ్డి అదానీకి రూ.100 కోట్లు వాపస్ చేశారని చెప్పారు. ముడుపుల కుంభకోణం నుంచి అదానీని రక్షించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి అదానీ వ్యవహారం తేల్చాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ సమయం ముగిసిన తర్వాత 55 లక్షల ఓట్లు పోల్ కావడం అనుమానానికి దారితీస్తున్నదని చెప్పారు.