హైదరాబాద్/ఖమ్మం, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, వామపక్షాల మ ధ్య సీట్ల పంచాయితీ ఇంకా తేలలేదు. సీపీఎం, సీపీఐకి చెరో రెండు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇం దుకు అంగీకరించిన వామపక్షాల జాతీయ నాయకత్వం.. పోటీ చేసే స్థానాలపై రాష్ట్ర నాయకత్వంతోనే అవగాహనకు రావాలని సూచించింది. ఈ నేపథ్యంలో సీపీఎంకు మిర్యాలగూడతోపాటు వైరా స్థానం కేటాయిస్తామని చెప్తూ వచ్చిన కాంగ్రెస్ ఆదివారం మాట మార్చినట్టు సమాచారం. వైరాకు బదులు హైదరాబాద్ పరిధిలో మరొకటి ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. ఈ పరిణామంపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో ఎటూ తేల్చకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని సీపీఎం హెచ్చరించింది.
ఇంత కంటే దిగిరాలేం : తమ్మినేని
తమ పార్టీతో ఎన్నికల పొత్తు అంశాన్ని తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. ఆ పార్టీ ఇస్తామన్న వైరా, మిర్యాలగూడ సీట్లు కేటాయించకపోతే ఒంటరిగా పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమకు కేటాయించే సీట్ల విషయంలో కాంగ్రెస్ దోబూచులాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రాచలం, పాలేరు విషయంలో కాంగ్రెస్ నేతలు చెప్పినదానికి అంగీకరించామని, ఇంత కంటే ఇంకా దిగిరాలేమని తెలిపారు. ఈ నెల 31, నవంబర్ 1 తేదీల్లో జరిగే సీపీఎం రాష్ట్ర కార్యవర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము జరిపిన చర్చల పరిణామాలను మిత్రపక్షమైన సీపీఐకి వివరించామని, ఆ పార్టీ కూడా తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.