నిడమనూరు, అక్టోబర్ 10: కేంద్రంలో నియంతృత్వ బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా 28 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి అంటేనే ప్రధానికి భయం పట్టుకుందని, అందుకే ఇండియా పేరును భారత్‌గా మార్చాలని ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా నిడమనూరులో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు విషయంలో తాము పెద్దగా ఆసక్తి చూపడం లేదని, పొత్తు ఉన్నా, లేకపోయినా మిర్యాలగూడ శాసనసభ స్థానంలో సీపీఎం పోటీ చేస్తుందని ప్రకటించారు. నియంతృత్వ పోకడలతో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.