శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 02:18:34

తమిళనాడుకు తాగునీరు

తమిళనాడుకు తాగునీరు
  • ఆ రాష్ట్ర విజ్ఞప్తికి సీఎం కేసీఆర్‌ అంగీకారం
  • కేసీఆర్‌ను కలిసిన తమిళనాడు మంత్రుల బృందం
  • ఏపీ సీఎంతోనూ మాట్లాడిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తమిళనాడు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఆ రాష్ర్టానికి తాగునీటిని సరఫరా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితోనూ మాట్లాడి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, డీ జయకుమార్‌, పబ్లిక్‌ వర్క్స్‌శాఖ కార్యదర్శి డాక్టర్‌ కే మణివాసన్‌, సలహాదారు ఎం షీలాప్రియ తదితరులు గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. 


ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్నదని.. దానిని ఎదుర్కొనేందుకు సహకరించాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో రాష్ట్రమంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, స్మితాసబర్వాల్‌, ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే, సీఈలు మురళీధర్‌రావు, నరసింహారావు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రితోనూ సంప్రదింపులు జరుపాల్సి ఉన్నందున తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి తమ ఇరువురికీ అధికారికంగా లేఖలు రాయించాలని ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. తర్వాత మూడురాష్ట్రాల అధికారులు, నిపుణులస్థాయిలో సమావేశం ఏర్పాటుచేసి.. తదుపరి కార్యాచరణ తీసుకోవడానికి వీలుంటుందని వివరించారు. ఇది విజయవంతమైతే మూడు రాష్ర్టాలు దేశానికే ఆదర్శంగా మారుతాయని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారం విషయంలో రాష్ట్రాల మధ్య సుహృద్భావపూరితమైన వాతావరణం ఉండాలని.. పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని అభిలషించారు. 


తమిళనాడు తాగునీటి సమస్యను నీతి ఆయోగ్‌ సమావేశాల్లో పలుమార్లు లేవనెత్తానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా రెండు, మూడుసార్లు ఈ విషయంపై మాట్లాడారని వివరించారు. తాగునీటి సమస్యతో తమిళనాడు బాధపడటం దేశమంతా సిగ్గుపడాల్సిన అంశమని పేర్కొన్న సీఎం.. దేశంలో లభించే మొత్తం 70వేల టీఎంసీల జలాలలో సాగునీటి అవసరాలు తీరగా 30వేల టీఎంసీలు మిగిలి ఉంటాయని తెలిపారు. ఇందులో 10 వేల టీఎంసీలతో దేశం మొత్తం తాగునీటి అవసరాలు తీర్చవచ్చని వివరించారు.


తాగునీటిపై వ్యూహంతో ఉండండి

తాగునీటి సమస్య పరిష్కారంపై తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని కలిగిఉండాలని ఆ రాష్ట్ర ప్రతినిధి బృందానికి సీఎం కేసీఆర్‌ సూచించారు. తమిళనాడు తాగునీటి అవసరాలపై దేశవ్యాప్తంగానూ అవగాహన అవసరమని, అందరూ సహృదయంతో అర్థంచేసుకున్ననాడే ఈ సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రిగా, భారతీయుడిగా తమిళనాడుకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తమిళనాడు ప్రతినిధిబృందం అభ్యర్థనను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఫోన్‌చేసి చెప్పారు. ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని, తమిళనాడు ప్రతినిధిబృందం సభ్యులకు ఇచ్చిన సూచనలను వివరించారు. తమిళనాడులో తాగునీటి ఇబ్బందులు తెలిసిన విషయమే కాబట్టి.. ఆ రాష్ట్రానికి నీరందించాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్‌ ఈ సందర్భంగా ఏపీ సీఎంకు తెలిపారు.


logo