సారంగాపూర్, ఆగస్టు 3: పెద్ద కోటకు రాతి తలుపులు బిగించినట్లుగా కనిపించే ఈ అరుదైన కొండ (Talupula Gutta) జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామ శివారులో ఉంది. రేచపల్లి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మ్యాడారం తండా. ఈ తండకు దాదాపు కిలోమీటర్ దూరంలో కనిపిస్తాయి సహజ సిద్ధంగా ప్రకృతి ఏర్పాటు చేసినట్లు కనిపించే ఈ తలుపులు. అతి పెద్ద కొండకు రెండు తలుపులు చెక్కి, మూత వేసినట్లుగా కనిపిస్తుందీ. ఈ దృశ్యం. తలుపుల ఆకారంలో కనిపించడంతో దీన్ని తలుపుల గుట్ట అని స్థానికులు చెబుతారు. అత్యంత దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ తలుపుల గుట్ట ఉంది.
తలుపుల గుట్ట విషయమై మ్యాడారం తండా వాసులను కదిలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు చెబుతున్నారు. వేల సంవత్సరాల క్రితం ఇక్కడ పెద్ద లోయ ఉండేదని, దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పడిన ఈ లోయ అతి సుందరమైందని, ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని చూసి మునీశ్వరులు ఇక్కడ తపస్సుకు ఉపక్రమించారని చెబుతున్నారు. తమ దీక్షకు ఎలాంటి భంగం వాటిల్లరాదన్న భావంతో మునీశ్వర్లు రాతితో ప్రకృతి సిద్ధంగా ఏర్పడట్లు తలుపులను చేసి బిగించుకున్నారంటున్నారు. ఇందులో నిధి ఉందని, మునీశ్వర్లు ఇంకా తపస్సు చేసుకుంటున్నారని వారు నమ్ముతారు. అలాగే అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి రాత్రి రెండు గంటల మధ్య రాతి తలుపుల నుంచి ఓంకార శబ్దం వినిపిస్తుందని వారు పేర్కొంటున్నారు. కథ సంగతి ఎలా ఉన్న ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి తలుపులు మాత్రం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.