హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రూ.4000 కోట్లతో అభివృద్ధి చేశామన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయలేదంటూ రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ధైర్యం ఉంటే ఓపీనియన్ పోల్‌కు సిద్ధమా? అని తలసాని నిలదీశారు. శనివారం తెలంగాణ భవన్లో తలసాని శ్రీనివాస్‌యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు 23 నెలల పాలనలో రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ పర్యటించారో చెప్పాలని నిలదీశారు. నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయినా కట్టారా అని ప్రశ్నించారు.
‘ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చారు, కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకంలో భాగంగా రూ.లక్షతోపాటు తులం బంగారం కూడా ఇస్తామని, పింఛన్లు పెంచుతామని చెప్పారు. కానీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ నాయకులు.. ఉన్న పింఛన్లు కూడా సకాలంలో ఇవ్వడంలేదు’ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని తలసాని దుయ్యబట్టారు. ‘రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు, చాలా హుందాగా వ్యవహరించాలి. కానీ ప్రజావ్యతిరేక భాష మాట్లాడుతావా? ముందుగా నువ్వు మాటతీరు మార్చుకో’ అని సీఎం రేవంత్‌రెడ్డిని.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు.
కమ్మ ఓట్ల కోసం రేవంత్ ఆరాటం
నగరంలో కమ్మ సామాజిక వర్గం ఓట్ల కోసం ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అనే సంగతి తెలుసుకోవాలని తలసాని సూచించారు. ఎన్టీఆర్‌తో కలిసి గోపీనాథ్ చాలా ప్రాంతాల్లో పర్యటించిన సంగతి కూడా తెలుసుకోవాలని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి తప్ప, నగరంలోని మిగతా వాటి గురించి ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని నిరూపిస్తే.. తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు.. నగరంలో బీఆర్ఎస్ హయాంలో పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్ల మార్చి, ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు పెట్టడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీలా నడిపిస్తున్నదని ఎద్దేవా చేశారు.
ఓట్లు వేయకపోతే పథకాలు ఆపుతరా?
జూబ్లీహిల్స్‌లో హస్తం పార్టీకి ఓట్లు వేయకపోయినట్టయితే, ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం దేనికి సంకేతమని తలసాని ప్రశ్నించారు. ప్రజలను భయపెడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆగ్రహించారు. పథకాలు ఎట్లా అమలు చేయించాలో తమకు బాగా తెలుసు అని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మారావు, కార్పొరేటర్లు సామల హేమ, ప్రసన్నలక్ష్మీ, బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్, మహేందర్ పాల్గొన్నారు.