కరీంనగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : బీసీలకు రాజకీయ పరంగా కాకుండా చట్టబద్ధంగా 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్‌ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ‘మేమేమైనా (బీసీలు) బిచ్చగాళ్లం అనుకుంటున్నారా?’ అని మండిపడ్డారు. పార్లమెంట్లో చర్చకు వచ్చిన తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు. ఈ నెల 14న కరీంనగర్లో నిర్వహించే బీసీ కదనభేరి సభా స్థలాన్ని బీఆర్ఎస్ బీసీ ముఖ్యనాయకులు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, ఎల్ రమణ తదితరులు పరిశీలించారు.
అనంతరం కరీంనగర్ శివారు చింతకుంటలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తలసాని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేస్తున్నదని, ఈ నేపథ్యంలోనే ఈ నెల 14న కరీంనగర్లో బీసీ కదనభేరికి బీసీలు కదలి రావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి బీసీ బిడ్డలు, బీసీ సంఘాలు, బీఆర్ఎస్ శ్రేణులు, బీసీ ప్రొఫెసర్లు, మేధావులందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిందని తలసాని మండిపడ్డారు. రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, కుల వృత్తులను ప్రోత్సహిస్తామని, రూ.లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో అలవిగాని హామీలిచ్చి బీసీలను నమ్మించిందని, అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా, ఎలాంటి బడ్జెట్ లేదని, బీసీలను ఆదుకున్న సందర్భాలు లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ తీర్మానం చేసినప్పుడే గంగుల కమలాకర్, తాను ప్రశ్నించామని గుర్తుచేశారు. 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్రం ఒప్పుకోవడం లేదని, ఇదంతా డ్రామా అని తాము నిలదీసినట్టు తెలిపారు.
న్యాయపరమైన చిక్కుల గురించి ఆలోచించకుండా హడావుడిగా తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపారని, అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకముందే మరో డ్రామాకు తెరతీసి ఆర్డినెన్స్ తెచ్చారని, బీసీలను మభ్యపెట్టేందుకే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి వద్దకు తీర్మానం పోకముందే ఢిల్లీలో ధర్నా చేయడం హాస్యాస్పందంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. ఈ నెల 6, 7వ తేదీల్లో ఢిల్లీలో రాష్ట్రపతిని, ప్రధానిని కలుస్తామని, జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తామని చెప్పి ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులను తీసుకెళ్లి ఏం చేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారని దుయ్యబట్టారు. ఢిల్లీలో ఉన్న మూడు రోజులు రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్మెంట్ కూడా అడగలేదని, ఒక ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పోయినప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పేందుకే రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు.
ఢిల్లీలో ధర్నా చేసి ఏం సాధించారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ ఎవరి ద్వారా అడిగారో బహిర్గతం చేయాలని నిలదీశారు. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన వంద మంది ఎంపీలు వెళ్లి అపాయింట్మెంట్ అడిగితే ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వరా? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ఖర్గే కూడా రాలేదని, ఇక బీసీల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఎక్కడున్నదని ఫైర్ అయ్యారు.
సోమ, మంగళవారాల్లోనూ పార్లమెంట్ నడుస్తుందని, బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడే ప్రయత్నం చేస్తారేమోనని చూస్తున్నామని, జీరో అవర్లోనైనా ఈ అంశాన్ని లేవనెత్తుతారేమోనని బీసీలంతా ఎదురుచూస్తున్నారని, వంద మంది ఎంపీల్లో ఒక్కరు కూడా రిజర్వేషన్ల గురించి ప్రశ్నించడం లేదంటే కాంగ్రెస్‌కు బీసీలపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతున్నదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రెండు పర్యాయాలు జీహెచ్ఎంసీని బీసీలకు ఇచ్చారని, రాబోయే ఎన్నికల్లో కూడా ఈ స్థానాన్ని బీసీలకే ఇవ్వాలని, ఆర్టీసీ చైర్మన్ పదవిని రెండు సార్లు కేసీఆర్ బీసీలకే ఇచ్చారని, కాంగ్రెస్ ఇవ్వగలదా? అని ప్రశ్నించారు. 8 మంది బీసీ మంత్రులు ఉండాల్సిన చోట ముగ్గురే ఉన్నారని, మరో ఐదుగురు బీసీలను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీసీలకు బీఆర్ఎస్ ఒక్కటే శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టంచేశారు. కులగణన పేరుతో బీసీలను తక్కువ చేసి చూపిన కాంగ్రెస్, వారిని తీవ్రంగా అవమానించిందని మండిపడ్డారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ మాట్లాడుతూ ఆది నుంచీ బీసీలకు కాంగ్రెస్ వ్యతిరేకమని, స్వాతంత్య్రం రాకముందు, వచ్చిన తర్వాత కూడా బీసీలపై వివక్ష కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. మీడియాలో సమావేశంలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, విజయ, దావ వసంత, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.
బీసీలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకే కరీంనగర్లో కదనభేరి పేరిట శంఖారావం పూరించబోతున్నామని, ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలకు కేసీఆర్ ఏం చేశారో ఈ సభ ద్వారా వివరిస్తామని వెల్లడించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అలా కాదని ముందుకుపోతే కర్రుకాల్చి వాత పెట్టేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
తెలంగాణ సమాజం అంటేనే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలని ఉద్యమ కాలంలోనే తమ నాయకుడు కేసీఆర్ అనేక సభల్లో చెప్పేవారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. ప్రస్తుతం దేశంలో బీసీలు రెండో శ్రేణి ప్రజలుగా దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న సందర్భంలో వారి పట్ల కాంగ్రెస్ దయ్యంలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హామీలను తుంగలో తొక్కి బీసీల గొంతు కోసిందని, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే తమిళనాడు తరహాలో కొట్లాడాలని, 9వ షెడ్యూల్లో చేర్పించడమే ఏకైక పరిష్కార మార్గమని సూచించారు.
అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రిజర్వేషన్లకు మద్దతుగా అనేక పార్టీలను కూడగట్టారని, ఇక్కడి సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి వెళ్లి, ప్రధాని మోదీని తిట్టి రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తానని ప్రగల్భాలు పలికి వచ్చారని దుయ్యబట్టారు. రాజకీయ పదవులు, కాంట్రాక్టుల విషయంలో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి కార్పొరేషన్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారా? అని నిలదీశారు. తెలంగాణలో ఎవరికి అన్యాయం జరిగినా గర్జించే కేసీఆర్.. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు కంకణ బద్దులై ఉన్నారని స్పష్టంచేశారు.