హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి తుగ్లక్ పాలనను మరిపిస్తున్నాడని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ధ్వజమెత్తారు. తుగ్లక్ రాజ్యంలోలాగా ఇష్టం వచ్చినట్టు పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. తన 35 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడనే లేదని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి విచిత్ర పాలనను నడుపుతున్నారని చెప్పారు. నేడు ముఖ్యమంత్రికి, మంత్రుల మధ్య సయోధ్య లేదని తెలిపారు. బొగ్గు కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయట పెట్టగానే సిట్ పేరుతో నోటీసులు ఇచ్చి, వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
రెండేండ్లు అయినా కాంగ్రెస్ సర్కార్ ఒక్క ప్రాజెక్టు అయినా కట్టిందా? బీఆర్ఎస్ పూర్తిచేసిన వాటినే ప్రారంభిస్తున్నారని తెలిపారు. మేడారం జాతర అభివృద్ధిలో ఇన్చార్జి మంత్రికి, స్థానిక మంత్రులకు గొడవలు నడుస్తున్నాయని విమర్శించారు. కేటీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు ఇవ్వడం సర్కార్కే నష్టమని హెచ్చరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను తమ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం పోలీస్ అధికారుల చేతిలో ఉంటుందని తేల్చి చెప్పారు. హిల్ట్ పాలసీతో కాంగ్రెస్ పాలకులు దోపిడీకి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఫోన్‌ట్యాపింగ్ చేయడం లేదని, ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి, ఎమ్మెల్యేనైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు.