హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో-తెలంగాణ)కి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి ముస్లింలపై బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి దిగజారి చేస్తున్న ప్రయత్నాలను, చౌకబారు మాటలను పరిశీలించి, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్ తదితరులు గురువారం సీఈవోను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
అనంతరం తెలంగాణభవన్‌లో మీడియాతో మధుసూదనాచారి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి ముస్లింపై చేసిన వ్యాఖ్యలు, దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు వివరించారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామన్న భయంతో, ఆ తర్వాత తన పదవికి గండం తప్పదన్న ఆందోళనతోనే సీఎం రేవంత్‌రెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే పథకాలు పోతాయంటూ ఓటర్లను బెదిరిస్తున్నారని దుయ్యబటారు. రెండేండ్ల తన పాలనపై ప్రజల్లో పెల్లుబికుతున్న వ్యతిరేకత, జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతో రకరకాల సర్కస్ ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. యూసఫ్‌గూడ సభలో సీఎం రేవంత్‌రెడ్డి తన నగ్న స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటర్లను భయపెట్టేలా ఆయన ప్రసంగం కొనసాగిందని మండిపడ్డారు.
అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అధికార దుర్వనియోగానికి పాల్పడుతున్నారని, ప్రతిపక్ష సభలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మధుసూదనాచారి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన షకీల్ ఇంటికి వెళ్లి బెదిరింపు చర్యలకు దిగారని మండిపడ్డారు. స్థానిక పోలీసు అధికారి రమేశ్‌నాయక్ ఎవరి కనుసన్నల్లో, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరికి తొత్తుగా పనిచేస్తున్నాడో తెలుసునని, ఖాకీ దుస్తులకు సమాజంలో ఉండే ప్రతిష్ఠను ఆయన దిగజార్చుతున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ తెచ్చే దుర్మార్గం, ఇలాంటి పోలీసు అధికారుల వల్ల పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసు (సీఏఆర్పీ)ని పంపాలని సీఈవోకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ ఉప ఎన్నిక పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, జూబ్లీహిల్స్ ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసే విధంగా చూడాలని సీఈవోను కోరామని వెల్లడించారు. ఏ ఒక్క ఓటర్‌కు భయానక స్థితిని కల్పించినా బీఆర్ఎస్ తరుపున ప్రతిఘటన సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో సీఎం రేవంత్‌రెడ్డికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని మధుసూదనాచారి చెప్పారు. ఆయనకు జీవితంలో మరో ఎన్నికను చూసే పరిస్థితి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఏ ఒక్కరోజు కూడా ‘జై తెలంగాణ’ అనని రేవంత్‌రెడ్డి ముమ్మాటికీ తెలంగాణ పాలిటి ద్రోహి, శత్రువేనని పేర్కొన్నారు. ఎమర్జెన్సీని మంచి పాలన చేస్తున్న రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్ ఓటర్లు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు దేశం యావత్తు ఆసక్తిగా చూస్తున్నదని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటమి భయంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆగమాగమై పోతున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక పోలీసులు కూడా సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారని, బీఆర్ఎస్ ముస్లిం నేతలు షకీల్, వహీద్, అఖిల్‌ను భయభ్రాంతులను గురిచేస్తున్నారని మండిపడ్డారు. షకీల్ విషయంలో పోలీసుల ప్రవర్తనకు సంబంధించిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఇది ఇందిరమ్య రాజ్యామా? పోలీసు రాజ్యమా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక లేడీకీ, ఒక రౌడీకీ మధ్య, అభివృద్ధికి, అరాచకానికి మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ ఎన్నికలో రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తంచేశారు. కొన్ని ముఠాలు షేక్‌పేటలోని ఫంక్షన్ హాల్లో బసచేసినట్టు తెలిసిందని పేర్కొన్నారు. సెంట్రల్ పారా మిలటరీ దళాలను రప్పించి, రిగ్గింగ్‌ను ఆపాలని ఈసీని కోరినట్టు తెలిపారు. కాంగ్రెస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను బదిలీ చేయాలని కోరామని చెప్పారు. గల్లీలో కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధమని ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అలయ్-బలయ్‌కు సంబంధించిన వీడియో ప్రదర్శించారు. పోలీసుల్లారా..? ఖాకీబుక్లు చెల్లవు, పింక్‌బుక్‌లో తమరి పేర్లు ఎక్కిస్తున్నామని, లెక్కలు తేల్చుతామని హెచ్చరించారు.
ముస్లింలకు ద్రోహం చేయడానికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ముస్లిం నేత షకీల్ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో మైనారిటీల కోసం బడ్జెట్లో రూ.2,000 కోట్లు పెట్టి, అదనంగా మరో రూ.2,000 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4వేల కోట్లు బడ్జెట్లో చూపించి, రూ.600 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. మైనారిటీ గురుకులాల కోసమే ఆ నిధులు ఇచ్చారే కానీ, ఇమామ్, మౌజీల కోసం డబ్బులు విడుదల చేయలేదని మండిపడ్డారు. మైనారిటీలను అన్ని విధాలుగా మోసంచేశారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్, రామచంద్రునాయక్, సల్మాన్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.