హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివార్లో ప్రత్యేకంగా తైవాన్ పరిశ్రమ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఓ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దండుమల్కాపూర్కు సమీపంలో ఈ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఇందుకు సంబంధించి తైవాన్ చాంబర్ ఆఫ్ కామర్స్(టీసీసీ) ఉపాధ్యక్షుడు సైమన్ లీ, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం టీజీఐఐఐసీ కార్యాలయంలో ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు.
దండుమల్కాపూర్ సమీపంలో ఇప్పటికే ఉన్న 600 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు మరో 400 ఎకరాలు సేకరించి మొత్తం వెయ్యి ఎకరాల్లో ఈ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. తైవాన్ నుంచి రాష్ర్టానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో తైవాన్ ఇండస్ట్రియల్ పార్ ఏర్పాటు కోసం ఇప్పటికే రూపకల్పన జరిగిందని, పెట్టుబడిదారులతో సమావేశాలు, రాష్ర్టాన్ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.