KCR | గంగాధర, సెప్టెంబర్ 17 : ప్రజలకు మంచి చేయడంలో కేసీఆర్ను మించిన మరొక నాయకుడు లేడని గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన దూడం లక్ష్మీనారాయణ అన్నాడు. బూరుగుపల్లిలోని తన దుకాణంలో కేసీఆర్ బొమ్మతో ఉన్న గులాబీ కండువాను మెడలో వేసుకుని బట్టలు కుడుతున్న లక్ష్మీనారాయణను ఆసక్తిగా పలకరించింది నమస్తే తెలంగాణ.
ఈ సందర్భంగా కేసీఆర్ గురించి, బిఆర్ఎస్ పార్టీ గురించి తన అనుభవాలను తెలిపాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు విపరీతమైన అభిమానమని, బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఏ నాయకుడు ఉన్నా తనకు సంబంధం లేదని, కేసీఆర్ పిలుపే తనకు వేదవాక్కని తెలిపాడు. 20 ఏళ్లుగా కేసీఆర్ బొమ్మ ఉన్న కండువాను మెడలో వేసుకొని బట్టలు కుడుతున్నట్లు తెలిపాడు. భుజంపై కేసీఆర్ కండువా ఉంటే భరోసాగా ఉంటుందని, ఉత్సాహంగా పనిచేస్తానని తెలిపాడు. ప్రజలకు మంచి చేయడంలో కేసీఆర్ను మించిన నాయకుడు దేశంలో లేడని, తాను కేసీఆర్కు అభిమానినని గర్వంగా చెప్పుకుంటానని లక్ష్మీనారాయణ తెలిపాడు.